'స్టీఫెన్' ఓటీటీ టాక్: భయపెట్టాడా? బోర్ కొట్టించాడా?
దర్శకుడు మిథున్ బాలాజీ ఎంచుకున్న టేకింగ్ స్టైల్ రెగ్యులర్ గా కాకుండా కొత్తగా ఉంది. ఒక డార్క్ అండ్ రా టోన్ లో సినిమాను నడిపించారు.
By: M Prashanth | 6 Dec 2025 8:30 PM ISTనెట్ ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా స్ట్రీమ్ అవుతున్న 'స్టీఫెన్' సినిమా ఇప్పుడు థ్రిల్లర్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సైకో థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ తమిళ డబ్బింగ్ సినిమా కథనం కాస్త భిన్నంగా సాగుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, ఒక సమస్యాత్మక వాతావరణంలో పెరిగిన స్టీఫెన్, సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. కానీ ఆ క్రమంలో అమ్మాయిలను ఆడిషన్స్ పేరుతో పిలిచి ఏం చేశాడు? వరుస హత్యలు ఎందుకు చేశాడు? చివరికి తానే పోలీసులకు ఎందుకు లొంగిపోయాడు? అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్.
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్టీఫెన్ గా నటించిన గోమతి శంకర్ గురించి. చూడటానికి చాలా సామాన్యంగా, పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూనే.. తన నటనతో భయపెట్టాడు. అతని కళ్లల్లోని ఆ కామ్ నెస్, ఆ తర్వాత చూపించే క్రూరత్వం వణుకు పుట్టిస్తుంది. ఒక సైకో పాత్రలో అతను చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే స్టీఫెన్ తల్లిదండ్రులుగా నటించిన కుబేరన్, విజయశ్రీ స్క్రీన్ ప్రెజన్స్ కూడా బలంగా ఉంది.
దర్శకుడు మిథున్ బాలాజీ ఎంచుకున్న టేకింగ్ స్టైల్ రెగ్యులర్ గా కాకుండా కొత్తగా ఉంది. ఒక డార్క్ అండ్ రా టోన్ లో సినిమాను నడిపించారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం. గోకుల్ కృష్ణ కెమెరా పనితనం, రాఘవ్ రాయన్ అందించిన మ్యూజిక్ సీన్స్ లోని ఇంటెన్సిటీని పెంచాయి. టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా, క్వాలిటీగా ఉంది.
అయితే టెక్నికల్ గా బాగున్నప్పటికీ, కథనంలో మాత్రం అక్కడక్కడా తడబాటు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీసినట్లుగా, ఇంకొన్ని చోట్ల లాజిక్ లేనట్లుగా అనిపిస్తాయి. రైటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్, కౌన్సిలర్ పాత్రలను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. వారి పాత్రలు కేవలం గ్యాప్స్ ఫిల్ చేయడానికి మాత్రమే వాడుకున్నట్లుగా అనిపిస్తాయి.
సినిమా ఒక సైకలాజికల్ డ్రామాలా సాగినా, క్లైమాక్స్ కు వచ్చేసరికి దర్శకుడు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అప్పటివరకు ఉన్న ఫ్లోను మారుస్తూ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ను తీసుకురావడం, స్టీఫెన్ తాను చంపిన వారితో మాట్లాడే సీన్ ఆసక్తిని రేపుతాయి. సీక్వెల్ కు ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. ఈ ఒక్క పాయింట్ సినిమా గ్రాఫ్ ను కాస్త పైకి లేపింది.
మొత్తంగా చూస్తే 'స్టీఫెన్' కొన్ని చోట్ల భయపెట్టినా, మరికొన్ని చోట్ల విసిగిస్తుంది. రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా, రా గా చూడాలనుకునే వారికి ఇది ఒక ఆప్షన్. అయితే బలహీనమైన స్క్రీన్ ప్లేను భరించగలిగితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు కానీ, హార్డ్ కోర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కు పర్లేదు అనిపిస్తుంది.
