Begin typing your search above and press return to search.

జేసన్ సంజయ్‌తో మొదలైన ట్రెండ్.. నెక్స్ట్ ఎవ‌రు?

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ కిడ్స్ అంటే ఇప్పటివరకు ఎక్కువగా హీరోలు, హీరోయిన్లుగానే పరిచయం అయ్యారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Jun 2026 7:00 AM IST
జేసన్ సంజయ్‌తో మొదలైన ట్రెండ్.. నెక్స్ట్ ఎవ‌రు?
X

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ కిడ్స్ అంటే ఇప్పటివరకు ఎక్కువగా హీరోలు, హీరోయిన్లుగానే పరిచయం అయ్యారు. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి మారుతోంది. కెమెరా ముందు కనిపించడంపై కాకుండా, కెమెరా వెనుక సృజనాత్మక బాధ్యతలు తీసుకోవడంపై పలువురు స్టార్ వారసులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్ట‌ర్ గా పరిచయం అవుతుండటంతో, ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి ఇతర స్టార్ కిడ్స్‌పై పడింది. వీరిలో మరికొందరు ఇప్పటికే దర్శకత్వ విభాగంలో అనుభవం సంపాదిస్తుండగా, మరికొందరు తొలి అవకాశానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న సిగ్మా సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండ‌టంతో, స్టార్ హీరోల పిల్లలు దర్శకత్వ రంగంలో కూడా సత్తా చాటగలరనే చర్చ మొదలైంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మ‌నోజ్ ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. గ‌తంలో గౌత‌మ్ తిన్న‌నూరితో, ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగా టీమ్‌తో పాటు, ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో కూడా రిషి భాగ‌మైన‌ట్టు తెలుస్తోంది. సినీ నిర్మాణ ప్రక్రియపై లోతైన అవగాహన పెంచుకుంటున్న రిషి, సరైన కథ రెడీ అయిన తర్వాత డైరెక్ట‌ర్ గా పరిచయ‌మ‌య్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక మాస్ మహారాజా రవితేజ కొడుకు మహాధన్ కూడా హీరోగా కాకుండా ముందుగా డైరెక్ష‌న్ వైపే ఆసక్తి చూపిస్తున్నాడనే విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా సినిమాల మేకింగ్ ప్రాసెస్‌ను దగ్గరగా పరిశీలిస్తూ, టెక్నికల్ అంశాలపై అవగాహన పెంచుకుంటున్నాడు. మ‌హాధ‌న్ డైరెక్ట‌ర్ గా మార‌డానికి అప్పుడే రెడీగా లేక‌పోయినా, ఫ్యూచ‌ర్ లో అత‌ను కూడా డైరెక్ట‌ర్ గా తొలి ప్రయత్నం చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

బాలీవుడ్‌లో ఇప్పటికే ఈ ట్రెండ్ ప్రారంభమైంది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ యాక్టింగ్ కంటే డైరెక్ష‌న్, రైటింగ్ వైపు అడుగులేస్తూ తన మొద‌టి సినిమాను ఇప్ప‌టికే పూర్తి చేశాడు. స్టార్ ఇమేజ్‌ను పక్కనబెట్టి, కంటెంట్ క్రియేటర్‌గా తన గుర్తింపును నిర్మించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుమార్తె దియా కూడా చిన్న వయసులోనే లీడింగ్ లైట్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫ్యూచ‌ర్ లో పూర్తి స్థాయి డైరెక్ట‌ర్ గా మారుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేకపోయినా, సినిమా నిర్మాణంపై ఆసక్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకప్పుడు స్టార్ హీరోల వారసులంటే ఆటోమేటిక్‌గా హీరోలే అవుతారనే భావన ఉండేది. ఇప్పుడు మాత్రం కొత్త తరం స్టార్ కిడ్స్‌కు దర్శకత్వం, రచన, నిర్మాణం, టెక్నికల్ విభాగాలపై ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. అందుకే జేసన్ సంజయ్ ఎంట్రీ తర్వాత త్రివిక్రమ్ కొడుకు, రవితేజ కొడుకు లాంటి వారసులు కూడా ఎప్పుడు మెగాఫోన్ పట్టుకుంటారన్న ఆసక్తి ఇండస్ట్రీలో పెరుగుతోంది. రాబోయే కొన్నేళ్లలో స్టార్ కిడ్స్ నుంచి కొత్త డైరెక్ట‌ర్లు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.