నటన వద్దు.. డైరెక్షన్ ముద్దు.. అంటున్న సెలబ్రెటీ కిడ్స్!
వారసత్వం అంటే కేవలం నటన మాత్రమే కాదని నిరూపిస్తున్న వారిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఒకరు.
By: Madhu Reddy | 6 Feb 2026 8:45 AM ISTసాధారణంగా ఒక స్టార్ హీరో కొడుకో, కూతురో అనగానే అందరూ వారు వెండితెరపై ఎప్పుడు మెరుస్తారా అని ఎదురుచూస్తారు. వారసత్వాన్ని అందిపుచ్చుకుని హీరోలుగా సెటిల్ అవ్వడం టాలీవుడ్‌లో ఒక ఆనవాయితీ. కానీ, ప్రస్తుత తరం స్టార్ కిడ్స్ రూటు మార్చారు. మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించడం కంటే, కెమెరా వెనుక ఉండి కథను నడిపించడమే మాకు ఇష్టమని చాటిచెబుతున్నారు. నటన కంటే సృజనాత్మకమైన దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న ఆ వారసుల గురించి ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..
త్రివిక్రమ్ వారసుడు రిషి మరియు రవితేజ కొడుకు మహాధన్:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద కొడుకు రిషి ఇప్పటికే చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు. తండ్రి లాగే తనకూ దర్శకత్వంపై ఆసక్తి ఉండటంతో, విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న 'కింగ్ డమ్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. త్వరలో సందీప్ రెడ్డి వంగ - ప్రభాస్ ల భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్'కు కూడా ఆయన పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాస్ మహారాజా రవితేజ కొడుకు మహాధన్ కూడా తండ్రి బాటలో నటుడు అవ్వకుండా, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో శిక్షణ పొందుతూ త్రివిక్రమ్ తనయుడితో కలిసి పని చేయబోతునట్టు టాక్.
బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. డైరెక్షన్ వైపే మొగ్గు:
వారసత్వం అంటే కేవలం నటన మాత్రమే కాదని నిరూపిస్తున్న వారిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఒకరు. ఈయన నటన కంటే డైరెక్షన్ మరియు రైటింగ్ పై ఆసక్తితో ఇప్పటికే ఒక బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. అలాగే గతంలో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇండస్ట్రీలోని మరికొందరు వారసులు కూడా మొదట మేకింగ్‌లో మెలకువలు నేర్చుకోవాలని రాజమౌళి, సుకుమార్ వంటి దిగ్గజ దర్శకుల దగ్గర అసిస్టెంట్లుగా చేరుతున్నారు. గ్లామర్ కంటే క్రియేటివిటీకే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
నటుల వారసులు కేవలం నటులే అవ్వాలన్న రూల్ ఇప్పుడు మారిపోయింది. సినిమా పట్ల నిజమైన ప్యాషన్ ఉన్నవారు కథను ఎలా చెప్పాలో నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేయడం వల్ల సినిమా మేకింగ్ లోని కష్టనష్టాలు వారికి అర్థమవుతాయి. రిషి, మహాధన్, ఆర్యన్ ఖాన్ వంటి వారు భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్లుగా ఎదిగి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం. వెండితెరపై కంటే వెండితెర వెనుక నుండి అద్భుతాలు సృష్టించే ఈ కొత్త తరం వారసుల ప్రయాణం ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయనుంది.
