అందరూ కొడుకుల్ని బయటకు పంపితే.. బోయపాటి మాత్రం..
బోయపాటి శ్రీను కుమారుడు హర్షిత్ విషయంలో మాత్రం రూట్ కాస్త వేరుగా ఉంది.
By: M Prashanth | 21 Aug 2026 12:13 PM ISTసినిమా కుటుంబాల నుంచి దర్శకత్వం వైపు వచ్చే కొత్త తరం ఈమధ్య ఒక రూట్ ఫాలో అవుతోంది. ఇంట్లోనే పెద్ద పేరున్న దర్శకుడు ఉన్నా ముందుగా మరో దర్శకుడి సెట్లో పని చేయడం కనిపిస్తోంది. త్రివిక్రమ్ కుమారుడు రిషి ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. రవితేజ కుమారుడు మహాధన్ కూడా అదే టీమ్‌లో ఉన్నాడు. అంటే ఇంట్లోనే సినిమా అనుభవం ఉన్నా, బయట వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కీరవాణి కుమారుడు శ్రీ సింహ కూడా ఇలానే చేశాడు. రాజమౌళి కుటుంబంలోనే ఉన్నా ఆయన దగ్గరకు వెళ్లకుండా సుకుమార్ ‘రంగస్థలం’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ తర్వాత నటుడిగా మారాడు. తాను గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సుకుమార్ దగ్గర పని చేయడం వల్ల సినిమా మేకింగ్ ఎలా జరుగుతుందో దగ్గరగా తెలుసుకున్నానని సింహ గతంలో చెప్పాడు.
బోయపాటి శ్రీను కుమారుడు హర్షిత్ విషయంలో మాత్రం రూట్ కాస్త వేరుగా ఉంది. హర్షిత్ రెండు సినిమాలకు తన తండ్రి దగ్గరే అసిస్టెంట్‌గా పని చేసినట్లు సమాచారం. ఇప్పుడు అతన్ని దర్శకుడిగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హీరో, నిర్మాత ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. బోయపాటి కావాలంటే కొడుకును మరో స్టార్ డైరెక్టర్ దగ్గరకు పంపించే అవకాశం ఉండేది. కానీ తన సెట్లోనే ఉంచుకుని పని నేర్పించాడు.
అయితే బోయపాటి సినిమాల మేకింగ్ కూడా సాధారణంగా చిన్న సెటప్‌లో ఉండదు. పెద్ద హీరోలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, వందల మందితో షూటింగ్, కమర్షియల్ సినిమా ప్లానింగ్.. ఇవన్నీ హర్షిత్ తన తండ్రి దగ్గరే చూసే అవకాశం వచ్చింది. బయట దర్శకుడి స్టైల్ నేర్చుకోవడం ఒక పద్ధతి అయితే, తండ్రి దగ్గరే మొదటి నుంచి చివరి వరకు సినిమా ఎలా నడుస్తుందో చూడడం మరో పద్ధతి.
అయితే హర్షిత్ దర్శకుడిగా వచ్చిన తర్వాత మాత్రం ఇదే పోలిక మొదలవుతుంది. త్రివిక్రమ్ కొడుకు వంగా దగ్గర పని చేశాడు కాబట్టి అతని సినిమాపై తండ్రి స్టైల్ అంచనాలు తగ్గొచ్చు. శ్రీ సింహ సుకుమార్ దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా అలాగే జరిగింది. హర్షిత్ మాత్రం బోయపాటి దగ్గరే పని చేయడంతో మొదటి సినిమా వచ్చిన వెంటనే యాక్షన్, హీరో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయనే పోలిక వచ్చినా రావచ్చు. అందుకే హర్షిత్ మొదటి సినిమాపై ఆ ప్రేజర్ ఉండొచ్చు. తండ్రి దగ్గర నేర్చుకున్న మాస్ మేకింగ్‌నే తన స్టైల్‌గా మార్చుకుంటాడా.. లేక అక్కడ నేర్చుకున్న అనుభవంతో పూర్తిగా మరో రూట్ తీసుకుంటాడా చూడాలి.
