Begin typing your search above and press return to search.

మార్పు దిశగా అడుగులా? వ్యక్తిగత ఇమేజ్ కోసమా?

అలియా భట్ , దీపికా పదుకొణె వంటి నటీమణులు భారీ చిత్రాల్లో నటించినప్పుడు అక్కడ వారి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఉంటున్నాయి.

By:  Srikanth Kontham   |   22 April 2026 5:00 AM IST
మార్పు దిశగా అడుగులా? వ్యక్తిగత ఇమేజ్ కోసమా?
X

పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. గ్లామర్ పాత్రలకు, పెద్ద హీరోల సినిమాలకు పరిమితమైన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు కంటెంట్ ఉన్న చిన్న , మధ్య తరహా బడ్జెట్ చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కమర్షియల్ హంగులకే ప్రాధాన్యత ఇచ్చిన వారు తాజాగా నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన కథ‌ల్ని ఎంచుకుంటున్నారు. దీంతో ఈ మార్పు వారి వ్యక్తిగత ఇమేజ్ కోసం చేస్తోన్న‌ ప్రయత్నమా? లేక పెద్ద బడ్జెట్ చిత్రాల్లో వారి పాత్రల ప్రాముఖ్యతను పెంచే వ్యూహమా? అన్న‌ది చర్చనీయాంశంగా మారింది. వాస్త‌వానికి స్టార్ హీరోయిన్లు చిన్న చిత్రాల్లో నటించడం వ‌ల్ల ఆ సినిమాలకు విపరీతమైన క్రేజ్ లభిస్తుంది.

నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి, స‌మంత‌ వంటి నటీమణులు కథాబలం ఉన్న చిత్రాలను భుజాన వేసుకుని విజయతీరాలకు చేర్చిన సందర్భాలు అనేకం. దీంతో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఉంటే చాలు సినిమా ఆడు తుంది అనే నమ్మకం అంత‌కంత‌కు బలపడుతోంది. ఈ ధోరణి వల్ల గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా నటిగా వారికున్న మార్కెట్ విలువ, గౌరవం పెరుగుతున్నాయి. పెద్ద బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు తరచుగా పాటలకో, కొన్ని సన్నివేశాలకో పరిమితం అవుతుంటాయి. అయితే కంటెంట్ చిత్రాల ద్వారా తామేంటో నిరూపించుకున్న హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకునేటప్పుడు దర్శకులు కూడా వారి పాత్రలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

అలియా భట్ , దీపికా పదుకొణె వంటి నటీమణులు భారీ చిత్రాల్లో నటించినప్పుడు అక్కడ వారి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఉంటున్నాయి. అంటే చిన్న చిత్రాల ద్వారా సాధించిన గుర్తింపు పెద్ద చిత్రాల్లో వారి పాత్రల బరువును పెంచుతోందని చెప్పొచ్చు. అయితే ఇది వ్యక్తిగత ఇమేజ్ కోసం చేసే ప్రయత్నం అని భావించే వారు కూడా లేకపోలేదు. గ్లామర్ పాత్రల కాల పరిమితి తక్కువ కాబట్టి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడం ద్వారా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం కొనసాగొచ్చు అనేది ఓ వ్యూహం. అవార్డులు, ప్రశంసలు దక్కించుకోవడం ద్వారా తమ బ్రాండ్ వాల్యూను స్థిరపరుచుకోవడం వీరి ప్రధాన ఉద్దేశ్యం అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు.

దీనివల్ల సోషల్ మీడియాలో ,వాణిజ్య ప్రకటనల రంగంలో వారి డిమాండ్ స్థిరంగా ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రాకతో ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. స్టార్ హీరోయిన్లు చిన్న చిత్రాల్లో నటిస్తే ఆ చిత్రాలకు మంచి డిజిటల్ బిజినెస్ జరుగుతోంది. నిర్మాతలు కూడా రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో పరిశ్రమలో కొత్త దర్శకులకు, భిన్నమైన కథలకు ఆదరణ లభిస్తోంది. హీరోయిన్లు ఒక సామాజిక వర్గానికో లేదా గ్లామర్ సెక్షన్ కో పరిమితం కాకుండా ప్రతిభావం తులైన నటీమణులుగా ఎదగడానికి ఇదొక గొప్ప వేదికగా మారింది. స్టార్ హీరోయిన్లు కంటెంట్ చిత్రాల వైపు రావడం అనేది పరిశ్రమకు, వారి కెరీర్‌కు మేలు చేసే పరిణామం. ఇది ఇమేజ్ బిల్డింగ్ మాత్రమే కాదు. భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాల్లో మహిళా పాత్రల తీరు తెన్ను లను మార్చే ఓ విప్లవాత్మక అడుగుగా చెప్పొచ్చు. నటి తన ప్రతిభను నిరూపించుకున్నప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల్లో కూడా ఆమెను కేవలం ఆభరణంలా చూపించడానికి దర్శకులు సాహసించరు.