స్టార్‌డమ్ రిస్క్: హీరోల నిర్మాణ భారాలు..ఫ్లాప్ పడితే వందల కోట్లు స్వాహా!
ఈ మార్పు ఓ వైపు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా? మరోవైపు ఊహించని ఆర్ధిక, వ్యక్తిగత రిస్కులను మోసుకొస్తోందన్నది అంతే వాస్తవం.
By: Srikanth Kontham | 3 Sept 2026 9:00 PM ISTప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమలో బిజినెస్ మోడల్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు కావలసిన పారితోషికం తీసుకుని సినిమా లాభనష్టాలతో సంబంధం లేకుండా తదుపరి ప్రాజెక్టులకు వెళ్లేవారు. కానీ నేటి పాన్-ఇండియా ట్రెండ్‌లో పరిస్థితి మారుతోంది. అగ్ర కథానాయకులు నటనకు పరిమితం కావడం లేదు. చిత్ర నిర్మాణంలో నేరుగా భాగస్వాములుగా మారుతున్నారు. ఈ మార్పు ఓ వైపు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నా? మరోవైపు ఊహించని ఆర్ధిక, వ్యక్తిగత రిస్కులను మోసుకొస్తోందన్నది అంతే వాస్తవం.
సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినంత కాలం భాగస్వామ్య నమూనా హీరోలకు అత్యధిక లాభాలను అందిస్తుంది. అయితే ఫలితం తేడా కొట్టి డిజాస్టర్‌గా మారితే మాత్రం దాని మొదటి ప్రభావం ఆ నటుడి ఆర్థిక స్థితిపైనే పడుతుంది. వందల కోట్ల భారీ బడ్జెట్‌లతో రూపొందే చిత్రాలకు స్వయంగా నిర్మించడం లేదా ప్రొడక్షన్ భాగస్వామిగా ఉండటం వల్ల మార్కెట్‌లో వచ్చే నష్టాలను నేరుగా భరించాల్సి వస్తుంది. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొనే నష్టాలకు పూచీకత్తుగా నిలవడం .. రీఫండ్‌లు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడి హీరోల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది.
ఆర్థిక నష్టాల కంటే స్టార్ హీరోలను తీవ్రంగా వేధించేది ఇమేజ్ పరంగా పడే దెబ్బ. నటుడిగా ఉన్నప్పుడు ఫ్లాప్ పడితే ఆ నిందను దర్శకుడు లేదా కథనంపైకి నెట్టేసే అవకాశం ఉంటుంది. కానీ నిర్మించిన ప్రాజెక్ట్ విఫలమైతే ఆ సినిమా ఎంపిక, మేకింగ్, ప్రమోషన్స్ , కంటెంట్ నాణ్యతలో లోపాలన్నింటికీ హీరోనే ప్రత్యక్ష బాధ్యుడిగా మారతాడు. సోషల్ మీడియా యుగంలో భారీ చిత్రం ఫ్లాప్ అయితే హీరో మార్కెట్ వాల్యూ, బ్రాండ్ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది హీరోల తదుపరి చిత్రాల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
ఈ తరహా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు స్టార్ హీరోల ముందున్న ఏకైక మార్గం అప్ కమింగ్ ప్రాజెక్టులపైనే ఆశలు పెట్టుకోవడమే. ఒక్క భారీ ఫ్లాప్ తెచ్చిపెట్టిన ఆర్థిక లోటును, కోల్పోయిన మార్కెట్ క్రేజ్‌ను భర్తీ చేయడానికి తదుపరి చిత్రాన్ని మరింత భారీ స్కేల్‌దో తిరుగులేని కాంబినేషన్లతో ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ కొత్త సినిమా ఒక డూ-ఆర్-డై పరిస్థితుల్లో రూపొందాల్సి ఉంటుంది. ఇది నటులపై మానసిక ఒత్తిడిని, ప్రొడక్షన్ వ్యయాన్ని మరింత పెంచుతుంది.
దీంతో తోడు ప్రొడక్షన్ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం వల్ల నటులు అసలైన సృజనాత్మకతపై, నటనపై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నారు. డేట్ల అడ్జస్ట్‌మెంట్స్, బడ్జెట్ నియంత్రణలు, బిజినెస్ క్లోజింగ్‌లు వంటి వ్యాపార విషయాల్లో తలదూర్చడం వల్ల క్రియేటివ్ ప్రాసెస్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక నటుడు సెట్స్‌పై పాత్ర మాత్రమే కాకుండా నిర్మాతగా వందల కోట్ల ఆర్థిక భాధ్యతను కూడా మోయడం వల్ల వారి నుంచి రావాల్సిన అత్యుత్తమ ప్రదర్శన మందగించే అవకాశాలు లేకపోలేదు.
స్టార్ హీరోలు నిర్మాణ భాగస్వాములుగా మారడం అనేది రెంచెంచల కత్తి లాంటిది. భారీ విజయాలు సాధించినప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు, అపారమైన లాభాలు వచ్చినా? పరాజయాలు ఎదురైనప్పుడు అది హీరోల కెరీర్‌ను, మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు కేవలం ప్రాజెక్ట్ స్కేల్ మాత్రమే కాకుండా కథల నాణ్యత, సరైన బడ్జెట్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టినప్పుడే నిర్మాణ భారాల నుంచి సురక్షితంగా బయటపడగలరు.
