కాంబినేషన్ కాన్సెప్ట్ ను డామినేట్ చేస్తోందా?
ముఖ్యంగా కాంబినేషన్ల హడావుడి కొత్త కథలను, వైవిధ్యమైన ఐడియాలను రానివ్వకుండా అడ్డుకట్టగా మారుతోందనేది వాస్తవం.
By: Srikanth Kontham | 27 Jun 2026 11:00 AM ISTటాలీవుడ్ ట్రేడ్ మార్కెట్‌లో ఓ సరికొత్త సమీకరణం రాజ్యమేలుతోంది. సినిమా కథాంశం ఏంటి? అందులో కంటెంట్ ఎంతుందనే విషయాల కంటే ఏ హీరోతో ఏ దర్శకుడు జతకడుతున్నాడనే క్రేజీ కాంబినేషన్ చుట్టూనే వందల కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాగుతోంది. ఒక స్టార్ హీరో - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కలయికలో సినిమా అనౌన్స్ కాగానే, ఆ కాంబినేషన్ బ్రాండ్ వాల్యూని చూసి డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ ధరలకు రైట్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ ట్రెండ్ మార్కెట్ పరంగా నిర్మాతలకు తక్షణ సేఫ్ జోన్‌ను కల్పిస్తున్నప్పటికీ లాంగ్ రన్‌లో సినిమా పరిశ్రమ ఆరోగ్యానికి ఎలాంటి సంకేతాలను ఇస్తోందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో ఊపందుకుంది.
ఈ కాంబినేషన్ క్రేజ్ అనేది స్టార్ హీరోల కెరీర్‌కు స్వల్పకాలంలో భారీ హైప్, రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తీసుకురావ డానికి ప్లస్ పాయింట్‌గా మారుతుంది. అగ్ర దర్శకుల ట్రాక్ రికార్డ్ - హీరోల స్టార్ పవర్ తోడైనప్పుడు లభించే థియేట్రికల్ అడ్వాంటేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ మోడల్‌లో రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కేవలం కాంబినేషన్‌ను నమ్మి భారీ బడ్జెట్లు కేటాయించడం వల్ల ఒకవేళ కథలో బలం లేక సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే ఆ నష్టం అంచనాలకు అందనంత భారీగా ఉంటోంది. కేవలం క్రేజ్ మీదే వ్యాపారం నడవడం వల్ల, స్టార్ హీరోల కెరీర్ గ్రాఫ్ స్థిరత్వానికి లాంగ్ రన్‌లో ఇది పెద్ద సవాల్‌గా మారుతోంది.
ముఖ్యంగా కాంబినేషన్ల హడావుడి కొత్త కథలను, వైవిధ్యమైన ఐడియాలను రానివ్వకుండా అడ్డుకట్టగా మారుతోందనేది వాస్తవం. ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు -హీరోలు సేఫ్ బెట్ కోసం ఇప్పటికే నిరూపించుకున్న స్టార్ డైరెక్టర్ల వెనుకే పరుగులు తీస్తున్నారు. దీనివల్ల సరికొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు, రైటర్లకు అగ్ర హీరోల డేట్లు దొరకడం గగనమైపోతోంది. ఒకవేళ కొత్త కథ వినడానికి హీరోలు సిద్ధంగా ఉన్నా? బిజినెస్ వర్గాలు - డిస్ట్రిబ్యూటర్లు ఆ ప్రాజెక్ట్‌పై పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా కథ కంటే కాంబినేషనే స్క్రిప్ట్ విలువను నిర్ణయించే పరిస్థితి వస్తోంది.
ఈ ధోరణి వల్ల కథల విషయంలో ఒక రకమైన కమర్షియల్ మోసధోరణి ఏర్పడే ప్రమాదం ఉంది. స్టార్ డైరెక్టర్లు సైతం సదరు హీరో ఇమేజ్‌ను, అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయాలనే ఒత్తిడిలో పాత సక్సెస్ ఫార్ములాలనే మళ్లీ మళ్లీ రొటీన్ ఎలిమెంట్స్‌తో వడ్డించే అవకాశం ఉంది. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్ల కోసం కథను పక్కన పెట్టడం వల్ల కంటెంట్ పరంగా టాలీవుడ్ వెనుకబడిపోయే ప్రమాదం పొంచి ఉంది. విజువల్స్ పరంగా ఎంత రిచ్‌గా ఉన్నా? కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు ఏ స్థాయి కాంబినేషన్‌నైనా? తిరస్కరిస్తారని గతంలో పలు ఉదాహరణలు నిరూపించాయి.
వ్యాపార పరంగా కాంబినేషన్ అనేది సినిమాను మార్కెట్ చేయడానికి అద్భుతమైన సాధనమే కావచ్చు. కానీ అది మాత్రమే సినిమాను రక్షించలేదు. టాలీవుడ్ లాంగ్ రన్‌లో పాన్-ఇండియా స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే కాన్సెప్ట్ కు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. ఎంతటి క్రేజీ కాంబినేషన్ అయినా? దానికి బలమైన కంటెంట్ తోడైనప్పుడే అది పరిశ్రమకు మేలు చేస్తుంది. స్టార్ హీరోలు దర్శకుల పేర్లను చూసి కాకుండా కొత్త కథలను ప్రోత్సహించే బిజినెస్ స్ట్రాటజీలను అవలంబించినప్పుడే ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందన్నది కాదనలేని నిజం.
