నాన్నకు ప్రేమతో: ఇండస్ట్రీలో అదరగొడుతున్న స్టార్ డాటర్స్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వారసత్వం అంటే ఒకప్పుడు కేవలం కథానాయకులుగానే వెండితెరపై కనిపించడం అనే భావన ఉండేది.
By: Sivaji Kontham | 22 Aug 2026 1:29 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో వారసత్వం అంటే ఒకప్పుడు కేవలం కథానాయకులుగానే వెండితెరపై కనిపించడం అనే భావన ఉండేది. కానీ కాలంతో పాటు మారిన ఆలోచనలతో నేటి తరం స్టార్ డాటర్స్ తాము కేవలం తెరపై కనిపించడానికే పరిమితం కాదని నిరూపిస్తున్నారు. తమ తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూనే, తెర వెనుక కీలక పాత్రలు పోషిస్తూ పరిశ్రమకు సరికొత్త ఊపిరి పోస్తున్నారు. నిర్మాణ భాగస్వామ్యం.. కాస్ట్యూమ్ డిజైనింగ్.. దర్శకత్వం.. క్రియేటివ్ హెడ్స్ వంటి కీలక విభాగాల్లో `బాస్ లేడీస్`గా తమదైన ముద్ర వేస్తూ సినీ రంగానికి విశేష సేవలందిస్తున్నారు.
టాలీవుడ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల తన తండ్రి నటించే చిత్రాలకు ప్రధాన కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించడమే కాకుండా, `గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్` బ్యానర్‌పై నిర్మాతగా వెబ్ సిరీస్‌లు, సినిమాలను నిర్మిస్తూ సఫలీకృతమయ్యారు. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తండ్రి సినిమాల నిర్మాణ వ్యవహారాలు.. క్రియేటివ్ ప్లానింగ్ .. పీఆర్ మేనేజ్‌మెంట్‌లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నటిగా మెప్పించడమే కాకుండా, `పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్` బ్యానర్‌లో వైవిధ్యమైన వెబ్ సిరీస్‌లు, లఘు చిత్రాలు, సినిమాలను నిర్మిస్తూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇదే బాటలో మాస్ మహారాజా రవితేజ కుమార్తె మోక్షద కూడా ఫిలిం మేకింగ్ .. నిర్మాణ వ్యవహారాల్లోకి అడుగుపెట్టి తన ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు.
కోలీవుడ్ (తమిళ పరిశ్రమ) లో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు సినీ నిర్మాణంలోనూ, దర్శకత్వంలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ 3, లాల్ సలామ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించగా.. చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ భారతదేశంలోనే తొలి మోషన్ క్యాప్చర్ యానిమేషన్ చిత్రమైన `కొచ్చడయాన్` కు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ రంగంలోనూ చురుగ్గా వ్యవహరించారు. వీరితో పాటు తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్ నటనతో పాటు మ్యూజిక్ కంపోజిషన్ లోను రాణిస్తున్నారు. శ్రుతిహాసన్ అగ్ర హీరోయిన్ గా, సంగీతజ్ఞురాలిగా నిరూపిస్తుండగా, అక్షర అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నటిగాను కొనసాగుతున్నారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ వైవిధ్యమైన పాత్రలతో నటిగా పరిశ్రమలో కొనసాగుతున్నారు.
ఇతర సినీ పరిశ్రమల్ని పరిశీలిస్తే.. బాలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో కూడా సెలబ్రిటీల కుమార్తెలు ఫిలిం మేకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. బాలీవుడ్‌లో అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్ `అయేషా`, `వీరే ది వెడ్డింగ్` వంటి విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా.. స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తూ డిజైనింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. బోనీ కపూర్ కుమార్తె జాన్వీ కపూర్.. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ నటీమణులుగా దూసుకెళ్తుంటే.. జోయా అక్తర్ (జావేద్ అక్తర్ కుమార్తె) భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర దర్శకురాలిగా నిలిచారు. మాలీవుడ్‌లో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజాల కుటుంబాల నుంచి.. శాండల్‌వుడ్‌లో డాక్టర్ రాజ్‌కుమార్ కాంపౌండ్ నుంచి కూడా మహిళా మణులు ప్రొడక్షన్, క్రియేటివ్ విభాగాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
తండ్రుల పేర్లను నిలబెడుతూనే తమ సొంత ప్రతిభతో సినీ పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకోవడం ఈ బాస్ లేడీస్ ప్రత్యేకత. స్క్రీన్ ముందుకు రాకపోయినా.. స్క్రీన్ వెనుక ఉండి ప్రాజెక్టులను ప్లాన్ చేయడం.. కంటెంట్ క్వాలిటీ పెంచడం.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం వంటి పనులతో వీరు పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. సినిమా అంటే కేవలం నటన మాత్రమే కాదని, సాంకేతిక - నిర్మాణ విభాగాల్లోనూ మహిళలు రాణించగలరని నిరూపిస్తూ తండ్రికి తగ్గ తనయలుగా.. సినీ రంగానికి దొరికిన అసలైన శక్తిగా ఈ వారసురాళ్లు ముందుకు సాగుతున్నారు.
