Begin typing your search above and press return to search.

16 ఏళ్ల నిరీక్షణ.. మాట నిలబెట్టుకున్న జక్కన్న

ఈరోజు (నవంబర్ 15) యావత్ భారతదేశం ఫోకస్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీపైనే ఉంది.

By:  M Prashanth   |   15 Nov 2025 5:43 PM IST
16 ఏళ్ల నిరీక్షణ.. మాట నిలబెట్టుకున్న జక్కన్న
X

ఈరోజు (నవంబర్ 15) యావత్ భారతదేశం ఫోకస్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీపైనే ఉంది. ఇది కేవలం ఒక సినిమా ఈవెంట్ కాదు, మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక పండగ రోజు. ఎస్.ఎస్. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న గ్లోబల్ సినిమా (SSMB29) టైటిల్ రివీల్ కోసం వేదిక సిద్ధమైంది. వేలాదిమంది అభిమానులు ఇప్పటికే 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం ఆర్ఎఫ్‌సి బాట పట్టారు.

ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ ప్రాజెక్ట్ నిన్నమొన్న సెట్ అయింది కాదు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ దాదాపు 16 ఏళ్ల క్రితమే లాక్ అయింది. 'క్షణ క్షణం', 'హలో బ్రదర్' వంటి క్లాసిక్స్ నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న కె.ఎల్. నారాయణకు రాజమౌళి ఎప్పుడో ఇచ్చిన మాట ఇది. 'రాఖీ' సినిమా తర్వాతే ఈ కాంబో ఫిక్స్ అయినా, 'బాహుబలి' వంటి భారీ ప్రాజెక్టులకు ఎక్కువ సమయం పట్టడం, ఆ తర్వాత కోవిడ్ రావడం వంటి కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది.

ఇచ్చిన మాటకు కట్టుబడిన జక్కన్న, ఇప్పుడు ఈ సినిమా ఈవెంట్‌ను కూడా చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేశారు. ఈవెంట్ కోసం ఇండియాలోనే తొలిసారిగా 100 అడుగుల ఎత్తు ఉన్న భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఒక సినిమా ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీకి (జియో హాట్‌స్టార్) అమ్మడం కూడా ఇదే మొదటిసారి. రాజమౌళి ఈ ఈవెంట్ డిజైనింగ్‌ను నెల రోజుల నుంచి దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఇంతకీ ఈ గ్లింప్స్‌లో ఏం చూపించబోతున్నారు? రాజమౌళి ఎప్పుడూ ఊహించని విధంగానే ప్లాన్ చేస్తాడు. ఈసారి కూడా, గ్లింప్స్‌లో కేవలం టైటిల్ మాత్రమే కాకుండా, కథను కూడా చూచాయిగా చెప్పబోతున్నారని సమాచారం. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాత్రలను పరిచయం చేస్తారని, బహుశా రామాయణానికి సంబంధించిన కొన్ని రిఫరెన్సులు కూడా ఉండొచ్చని గట్టిగా టాక్ నడుస్తోంది.

ఈ ఈవెంట్‌లో అభిమానుల కోసం మరిన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. శ్రుతి హాసన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని, కొన్ని ఎక్స్‌క్లూజివ్ మేకింగ్ వీడియోలను కూడా ఆ భారీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తారని తెలుస్తోంది. వీటన్నింటికీ మించి, మహేష్ బాబు ఎంట్రీ కోసం కూడా ఒక స్పెషల్ ప్లాన్ చేశారట. ఈ వేదికపై చిత్ర బృందం తప్ప, వేరే అతిథులు ఎవరూ ఉండటం లేదు.

బడా ఆఫర్లను సైతం పక్కన పెట్టి, 16 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం రాజమౌళి ఈ సినిమా చేస్తున్నారు. 'వారణాసి', 'సంచారి' లాంటి ఎన్నో పేర్లు ప్రచారంలో ఉన్నా, ఆ అసలైన టైటిల్ ఏంటో, జక్కన్న మ్యాజిక్ ఏంటో చూడటానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఒక గ్లింప్స్ కోసం ఇంత భారీ ఈవెంట్ చేస్తున్నారంటే, అందులో ఎంత దమ్ముందో అని ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.