Begin typing your search above and press return to search.

హాలీవుడ్ మీడియాలో 'SSMB29'.. జక్కన్న గ్లోబల్ ప్లాన్ ఇది!

రాజమౌళి మహేష్ బాబు సినిమా (SSMB29) టైటిల్ రివీల్ కోసం యావత్ భారతీయ సినిమా పరిశ్రమ ఎదురుచూస్తోంది.

By:  M Prashanth   |   14 Nov 2025 11:55 AM IST
హాలీవుడ్ మీడియాలో SSMB29.. జక్కన్న గ్లోబల్ ప్లాన్ ఇది!
X

రాజమౌళి మహేష్ బాబు సినిమా (SSMB29) టైటిల్ రివీల్ కోసం యావత్ భారతీయ సినిమా పరిశ్రమ ఎదురుచూస్తోంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ ఈవెంట్ కోసం కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాలో ఈ ఈవెంట్‌ను 'జియో హాట్‌స్టార్' లైవ్ స్ట్రీమ్ చేయనుండగా, ఇప్పుడు రాజమౌళి తన ప్లాన్‌ను దేశం సరిహద్దులు దాటించారు. ఇది కేవలం ఇండియన్ ఫ్యాన్స్‌కు మాత్రమే కాదని, గ్లోబల్ ఆడియన్స్‌ను కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాపై ఉన్న గ్లోబల్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈసారి టైటిల్ రివీల్ ఈవెంట్‌ను ఏకంగా ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ 'వెరైటీ' (Variety) తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్ చేయబోతోంది. ఇది ఏదో మొక్కుబడిగా చేస్తున్న పని కాదు, ఇది ఒక పక్కా ప్లాన్. ఈవెంట్ స్ట్రీమింగ్‌ను ప్రత్యేకంగా అమెరికన్ టైమింగ్స్ (ఉదయం 8:30 AM ) ప్రకారం ప్రమోట్ చేస్తుండటమే దీనికి అతి పెద్ద నిదర్శనం.

'వెరైటీ' అనేది హాలీవుడ్‌కు గుండెకాయ లాంటి మీడియా సంస్థ. అక్కడ ఒక సినిమా రివ్యూ వస్తేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది, ఒక భారతీయ సినిమా షూటింగ్‌లో ఉండగా, దాని టైటిల్ రివీల్ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ ఒక్క అడుగుతో రాజమౌళి తన సినిమా స్థాయి ఏంటో చెప్పకనే చెప్పారు. ఇది కేవలం ఓవర్సీస్‌లో ఉన్న భారతీయ ప్రేక్షకుల కోసం వేసిన ప్లాన్ కాదు, ఇది నేరుగా హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోలు, అంతర్జాతీయ మీడియాకు వేస్తున్న గాలం.

సాధారణంగా సినిమా పూర్తయ్యాక, ట్రైలర్ రిలీజ్ సమయంలో ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ రాజమౌళి, సినిమా విడుదలకు రెండేళ్లు సమయం ఉండగానే, కేవలం టైటిల్ కోసమే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌ను సెట్ చేశారు. అంటే, SSMB29ని మొదటి నుంచీ ఒక హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీలాగే ట్రీట్ చేస్తున్నారు. 'వారణాసి' అనే టైటిల్ వినిపిస్తున్నా, ఆ పేరు కంటే ఈ ప్రమోషన్ స్టైలే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమా కథ కూడా 'గ్లోబల్‌ట్రాటింగ్ అడ్వెంచర్' అని ముందే ప్రకటించారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే మార్కెటింగ్‌ను కూడా గ్లోబల్ చేశారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి పాన్ ఇండియా కాస్టింగ్‌తో పాటు, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం ఇలా ప్రతీ అంశం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఎంచుకున్నారు. ఈ 'వెరైటీ' డీల్ ఆ స్టాండర్డ్స్‌కు కేవలం ఒక శాంపిల్ మాత్రమే.

ఒకవైపు రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై టైటిల్ రివీల్ చేస్తూ, అదే సమయానికి 'వెరైటీ' ద్వారా హాలీవుడ్‌కు లైవ్ ఇవ్వడం రాజమౌళి విజన్‌ కు అసలు నిదర్శనం. 'RRR'తో గ్లోబల్ డోర్స్ ఓపెన్ చేసిన జక్కన్న, ఇప్పుడు SSMB29తో ఆ డోర్స్‌ను పూర్తిగా బద్దలు కొట్టి, ఇండియన్ సినిమా మార్కెట్‌ను మరో రేంజ్ కి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు.