మానవత్వం మేల్కొన్నవేళ.. మ్యూజిక్ డైరెక్టర్ ను కదిలించిన వైనం!
సినిమా ఇండస్ట్రీలో స్టార్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు, కానీ ఆ స్టార్డమ్ వెనుక ఉండే కొందరు అభిమానుల జీవితాలు ఒక్కోసారి విషాదాంతం అవుతుంటాయి.
By: Madhu Reddy | 19 Jun 2026 6:52 PM ISTసినిమా ఇండస్ట్రీలో స్టార్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు, కానీ ఆ స్టార్డమ్ వెనుక ఉండే కొందరు అభిమానుల జీవితాలు ఒక్కోసారి విషాదాంతం అవుతుంటాయి. అలాంటి ఒక సూపర్ స్టార్ మహేశ్ బాబు వీరాభిమాని కుటుంబానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ దేవుడిలా అండగా నిలిచారు. గతంలో తాను ఇచ్చిన మాటను గుర్తే పెట్టుకుని, సదరు అభిమాని పిల్లల చదువు బాధ్యతను స్వీకరించి ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు ప్రేక్షకుల గుండెల్లోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. ఆ వివరాలు చూద్దాం..
అభిమాని ఆత్మహత్య.. ఆ రోజే స్పందించిన తమన్:
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమాని అయిన రాజేశ్ అనే వ్యక్తి అప్పుల బాధలు తట్టుకోలేక గత ఏడాది 2025లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ కుటుంబం పరిస్థితి చూసి చలించిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రాజేశ్ ఇద్దరు పిల్లల చదువు బాధ్యతను తానే చూసుకుంటానని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే సెలబ్రిటీలు ఇలాంటి మాటలు చాలానే చెప్తారు, తర్వాత మర్చిపోతారు అనుకునే లోపే తమన్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.
ట్విట్టర్ లో పోస్ట్.. వెంటనే రియాక్షన్:
తాజాగా ఓ నెటిజన్ ఆ పాత విషయాన్ని ఎక్స్ వేదికగా తమన్‌కు గుర్తుచేశారు. ఈ పోస్ట్‌కు తమన్ చాలా పాజిటివ్‌గా, ఎమోషనల్‌గా స్పందించారు. ఇక కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వదిలేయకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే రంగంలోకి దిగారు. ఆ అభిమాని ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే పేమెంట్ చేసేశారు.
ఒకరిది రూ. 22 వేలు.. మరొకరిది రూ. 19 వేలు క్లియర్:
రాజేశ్ పెద్ద పాప స్కూల్ ఫీజు రూ. 22,620, అలాగే చిన్న బాబు స్కూల్ ఫీజు రూ. 19,550.. మొత్తంగా దాదాపు రూ. 42 వేలకు పైగా స్కూల్ ఫీజులను తమన్ ఆన్‌లైన్ ద్వారా వెంటనే చెల్లించి, ఆ రసీదులను కూడా షేర్ చేశారు. అంతటితో ఆగకుండా, ఆ ఇద్దరు పిల్లల పాఠశాల విద్యాభ్యాసం పూర్తిగా పూర్తయ్యేంత వరకు అయ్యే ప్రతి పైసా ఖర్చును తానే స్వయంగా భరిస్తానని మరోసారి ప్రకటన చేశారు.
డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ, కష్టాల్లో ఉన్న ఒక సాదాసీదా అభిమాని కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని ఆదుకునే పెద్ద మనసు కొందరికే ఉంటుంది. తమన్ చూపించిన ఈ మానవత్వం, గొప్ప మనసుకు అటు ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ వర్గాలు, నెటిజన్లు సైతం హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇద్దరు పిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన తమన్ నిజంగానే గ్రేట్.
