పరిశ్రమలో ట్రబుల్ షూటర్ గా మ్యూజిక్ సెన్సేషన్!
టాలీవుడ్ లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రస్థానం ప్రత్యేకమైనది. ఆయన చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇవ్వడమే కాదు.
By: Srikanth Kontham | 25 April 2026 8:45 AM ISTటాలీవుడ్ లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రస్థానం ప్రత్యేకమైనది. ఆయన చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇవ్వడమే కాదు. దర్శక, నిర్మాతలకు అత్యవసర సమయాల్లో అండగా నిలిచే ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందాడు. సాధారణంగా ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరొకరు సగం పనిచేసిన ప్రాజెక్టులోకి ప్రవేశించడానికి లేదా చివరి నిమిషంలో బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడరు. అది తమ ఇమేజ్‌కు భిన్నమని భావిస్తారు. కానీ తమన్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా వేరు. అవకాశం వస్తే అది ఎంత క్లిష్టమైనా సరే నో చెప్పకుండా పని పూర్తి చేయడం థమన్ నైజం.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` విషయంలో ఇదే జరిగింది. ఈ చిత్రానికి మొదట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పాటలు కూడా ఆయనే కంపోజ్ చేశారు. కానీ ప్రాజెక్ట్ చివరి దశలో మేకర్స్ థమన్ ని తీసుకున్నారు. చివరి నిమిషంలో తమన్ కి అవకాశం ఇచ్చినా? ఎటువంటి భేషజాలు లేకుండా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను తీసుకున్నాడు. సినిమాకు తనదైన శైలిలో ప్రాణం పోశాడు. తాజాగా విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47` ప్రాజెక్టులోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాకు తొలుత `యానిమల్` ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.
కొన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో త్రివిక్రమ్ అతడి స్థానంలో తాజాగా తమన్‌ను రంగంలోకి దించారు. మధ్యలో ప్రాజెక్టులోకి రావాల్సి వచ్చినా? తమన్ ఎంతో పాజిటివ్‌గా స్పందించి వెంటనే పని ప్రారంభించాడు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో పేరున్న సంగీత దర్శకులు ముందుకు రావడానికి వెనుకాడుతుంటారు. ఒకరు సగం చేసిన పనిని పూర్తి చేయడం లేదా మరొకరు వదిలేసిన ప్రాజెక్టును టేకప్ చేయడం తమ స్థాయికి తక్కువని కొందరు భావిస్తుంటారు. కానీ తమన్ మాత్రం పని పట్ల ఉన్న అంకితభావాన్ని, దర్శకులు తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తారు.
ఏ ప్రాజెక్టునైనా సవాలుగా తీసుకుని తక్కువ సమయంలోనే అవుట్‌పుట్ ఇవ్వడంలో ఆయన దిట్ట. అందుకే దర్శక, నిర్మాతలు ప్రతికూల సమయాల్లో తమన్ పేరే తలుస్తారు. తమన్ ప్రయాణం `బాయ్స్`సినిమాతో డ్రమ్మర్‌గా మొదలై నేడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగే వరకు ఆయనలో ఉన్న ఆ ఉత్సాహం , పని పట్ల నిబద్ధత మారలేదు. `అల వైకుంఠపురములో`, `అఖండ`, `పుష్ప 2`(బిజిఎం) వంటి చిత్రాల ద్వారా ఆయన తన స్థాయిని నిరూపించుకున్నాడు. భారీ ఆఫర్లు చేతిలో ఉన్నా? స్నేహానికి , నమ్మకానికి విలువనిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా బాధ్యతలు చేపట్టడం తమన్ వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని చాటుతోంది.
