Begin typing your search above and press return to search.

వార‌ణాసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన జ‌క్క‌న్న‌

ఆల్రెడీ వార‌ణాసి టైటిల్ ను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో వార‌ణాసిపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 Jan 2026 6:55 PM IST
వార‌ణాసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన జ‌క్క‌న్న‌
X

యావ‌త్ సినీ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందా అంటే అది వార‌ణాసి సినిమానే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ డ్రామాగా ఇది రూపొందుతుంది. జ‌క్క‌న్న ఈ మూవీని పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.




వార‌ణాసిపై భారీ అంచ‌నాలు

ఆల్రెడీ వార‌ణాసి టైటిల్ ను రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో వార‌ణాసిపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న మూవీ ల‌వ‌ర్స్ ఆతృతగా ఉన్నారు. అయితే రాజ‌మౌళి సినిమాలు సెట్స్ పైకి వెళ్ల‌డ‌మే కానీ ఎప్పుడు పూర్త‌వుతాయో ఎవ‌రూ చెప్ప‌లేరు. అలాంటిది ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళి అన్నీ చాలా భిన్నంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు.

ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే సెట్స్ పైకి!

మామూలుగా ఏ సినిమానైనా అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసి అందులో ఎవ‌రెవ‌రు ప‌ని చేస్తున్నారో చెప్పే రాజ‌మౌళి వారణాసి సినిమాను మాత్రం ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే చేశారు. ఎలాంటి ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌కుండా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి ప‌లు షెడ్యూళ్ల షూటింగ్ త‌ర్వాత టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసి దాంతోనే సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశారు.

వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్

ఇక ఇప్పుడు తాజాగా వార‌ణాసి రిలీజ్ డేట్ ను కూడా అలానే అనౌన్స్ చేశారు జ‌క్క‌న్న. 2027 ఏప్రిల్ 7న వార‌ణాసి సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు రాజ‌మౌళి ఎక్స్ వేదిక‌గా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. వాస్త‌వానికి వార‌ణాసి రిలీజ్ డేట్ పై నిన్న నుంచే లీక్స్ వ‌స్తున్నాయి. కాశీలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన హోర్డింగ్స్ క‌నిపించాయ‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌లైంది. ఇప్పుడు రాజ‌మౌళి కూడా అదే డేట్ ను క‌న్ఫ‌ర్మ్ చేస్తూ పోస్ట్ చేయ‌డంతో వార‌ణాసి రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చింది.

ఏప్రిల్ 7 రిలీజ్ అంటే సినిమాను ఉగాది సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నేది జ‌క్క‌న్న ప్లాన్. ఉగాది, గుడి ప‌డ్వా లాంటి ఫెస్టివ‌ల్స్ తో పాటూ అంబేడ్క‌ర్ జ‌యంతి, శ్రీరామ న‌వ‌మి ఇలా వ‌రుస సెల‌వుల‌ను దృష్టిలో పెట్టుకునే మేక‌ర్స్ ఇలా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. పురాణాల నేప‌థ్యంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుంగా, ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.