ష్..! జక్కన్న అందుకేనా సైలెన్స్?
అందుకే ఇప్పుడు మహేష్ తో పాన్ వరల్డ్ సినిమాని రాజమౌళి ఏ స్థాయిలో రూపొందిస్తున్నారు? అన్నది చూడాలనే ఆసక్తి అందరిలోను ఉంది.
By: Sivaji Kontham | 12 Nov 2025 7:00 AM IST`బాహుబలి` చిత్రంతో ప్రపంచస్థాయి మార్కెటింగ్ నైపుణ్యం అంటే ఏమిటో చూపించారు ఎస్.ఎస్.రాజమౌళి బృందం. ఎంపిక చేసుకున్న కాన్వాసుకు తగ్గట్టే, అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని సృష్టించిన రాజమౌళి ఈ సినిమాను ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు అందించడంలో సఫలమయ్యారు. భారతదేశం, అమెరికా సహా చాలా దేశాల నుంచి బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు అద్భుత వసూళ్లను సాధించాయి.
ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ కోసం ఇంకా అద్భుతమైన ప్రణాళికతో రాజమౌళి ముందుకు దూసుకెళ్లారు. వరల్డ్ క్లాస్ మార్కెటింగ్ టెక్నిక్ ని మరోసారి సవ్యంగా వినియోగించుకున్నారు. చివరకు బాక్సాఫీస్ వద్ద అనుకున్నది సాధించారు. ఆర్.ఆర్.ఆర్ కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించడంలోనే కాదు.. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయం సాధించడం వెనక రాజమౌళి అసాధారణ నైపుణ్యం చర్చల్లోకొచ్చింది. కథాంశం పరంగా ఆర్ఆర్ఆర్ ను హాలీవుడ్ ప్రముఖులు చర్చించుకోదగిన స్థాయిలో ఆవిష్కరించారు.
అందుకే ఇప్పుడు మహేష్ తో పాన్ వరల్డ్ సినిమాని రాజమౌళి ఏ స్థాయిలో రూపొందిస్తున్నారు? అన్నది చూడాలనే ఆసక్తి అందరిలోను ఉంది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమా-ఎస్.ఎస్.ఎం.బి 29 ప్రచారంలో వేగం పుంజుకుంటోంది. నవంబర్ 15న జరగనున్న గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కోసం జక్కన్న సర్వసన్నాహకాల్లో ఉన్నాడు. ఇది ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కోసం ఎలాంటి యూనివర్శల్ పాయింట్ ని ఎంచుకున్నారో, ఇప్పుడు అంతకుమించి అద్భుతమైన పాయింట్ తో మహేష్ సినిమాని రాజమౌళి అతి భారీ కాన్వాసులో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు అసాధారణ బడ్జెట్ ని వెచ్చించడంతో విజువల్ గాను రాజీకి రావడం లేదని తెలిసింది.
ఆర్.ఆర్.ఆర్ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా ఇది! అంటూ చెప్పుకునే స్థాయి రాజమౌళికి ఉంది. అతడు ప్రపంచవ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ దర్శకుడిగా అతడు మనసులను గెలుచుకున్నాడు. ఇప్పుడు మహేష్‌తో సినిమా విషయంలో రాజీ అన్నదే లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఈసారి పాశ్చాత్య దేశాల మార్కెట్ లో ప్రభావం చూపాలనే పట్టుదల జక్కన్నలో కనిపిస్తోంది. అయితే అందుకు తగ్గట్టు ప్రచారంలో వేగం పుంజుకోవాల్సి ఉంది.
ఫారెస్ట్ అడ్వంచర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ స్థాయిలో ఎగ్జయిట్ చేస్తుందని తొలి నుంచి రచయిత విజయేంద్రుడు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇది నిజంగా వరల్డ్ వైడ్ ఆడియెన్ ని ఆకట్టుకునే వ్యూహం. ప్రపంచస్థాయి ప్రేక్షకులను ఆకట్టుకోగల సమర్థుడైన భారతీయ దర్శకుడు ఎవరైనా ఉన్నారా? అంటే కచ్ఛితంగా రాజమౌళి పేరునే సూచిస్తున్నారు. అందుకే ఇప్పుడు మహేష్ సినిమాని అతడు మరో లెవల్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ ని మించిన మరో విజువల్ వండర్ ని అతడు క్రియేట్ చేయడమే గాక, ప్రచారపుటెత్తుగడల్లోను హాలీవుడ్ మార్కెట్ ని కొట్టేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
