'వారణాసి' తర్వాత 'మహాభారతం'పైనే రాజమౌళి ఫోకస్?
వారణాసి తర్వాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై దృష్టి పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రానికి రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై రాజమౌళి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
By: Sivaji Kontham | 13 Nov 2026 5:00 AM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో `వారణాసి` అనే భారీ అడ్వెంచర్ కం ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే అతడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం`పైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పటి నుంచో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పట్టాలెక్కించే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల విడుదలైన నితీష్ తివారీ `రామాయణ` చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. రాజమౌళి మహాభారతాన్ని ఎంచుకోవడం సరైన నిర్ణయమని సినీ అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ ఇతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను `రామాయణ` మరోసారి నిరూపించిందని.. అలాంటిది రాజమౌళి విజన్ తోడైతే `మహాభారతం` ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ మార్కెట్‌లో మరెన్నో రెట్లు పెంచుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన గాసిప్ కూడా వినిపిస్తోంది. `రామాయణ` చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నిర్మాత నమిత్ మల్హోత్రా.. రాజమౌళి `మహాభారతం` కోసం కూడా భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారట. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలతో ఈ మహాకావ్యాన్ని రూపొందించడానికి ఆయన ముందుకు రావొచ్చని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఇదంతా కేవలం సినీ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్ మాత్రమే..కానీ ఇది నిజం కావాలని కోట్లాది మంది సినీ ప్రియులు కోరుకుంటున్నారు. `వారణాసి` తర్వాత రాజమౌళి నుంచి తదుపరి ప్రాజెక్ట్ మహాభారతమే అయితే.. భారతీయ సినిమా చరిత్రలో మరో సంచలనం నమోదైనట్టేననే విశ్లేషణ మొదలైంది.
అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం` ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఈ ప్రాజెక్ట్ గురించి బాహుబలి చిత్రీకరణ సమయంలోనే ప్రచారం తెరపైకి వచ్చినా కానీ అప్పటి నుంచి ఇది రకరకాల కారణాలతో పాజిబుల్ కాలేదు. జక్కన్న టాలీవుడ్ లో పలువురు నిర్మాతలకు ఇచ్చిన కమిట్ మెంట్లను ఫుల్ ఫిల్ చేసే పనిలో పడ్డాడు. ఎట్టకేలకు అన్ని కమిట్ మెంట్లు పూర్తయాక తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తున్నాడని ప్రచారం తెరపైకొచ్చింది. అయితే దీనికి అధికారిక కన్ఫర్మేషన్ రాజమౌళి నుంచి రావాల్సి ఉంది.
