దిగ్గజ దర్శకులకు రాజమౌళి 'బస్తీ మే సవాల్': గ్లోబల్ రేంజ్ కోసం నెక్ట్స్ లెవెల్ ప్లాన్!
తెలుగు సినిమా సామర్థ్యాన్ని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వేసే ప్రతి అడుగు ఇప్పుడు సినీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
By: Sivaji Kontham | 5 Aug 2026 4:00 AM ISTతెలుగు సినిమా సామర్థ్యాన్ని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వేసే ప్రతి అడుగు ఇప్పుడు సినీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. RRRతో ఆస్కార్ వేదికపై సత్తా చాటడమే కాకుండా.. ఆయన తన తదుపరి చిత్రం `వారణాసి`తో సరిహద్దులు చెరిపేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా భాషలలో సినిమాని రిలీజ్ చేయాలనే సంకల్పంతో భారీ ప్రణాళికల్ని రూపొందించుకున్న సంగతి తెలిసిందే. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. RRR - వారణాసి చిత్రాలు కేవలం జక్కన్న ప్రయాణంలో ఆరంభం మాత్రమే! ఒకవేళ ఇవి కేవలం ఆరంభమే అయితే.. రాజమౌళి తదుపరి ప్రాజెక్టుల కోసం ఎలాంటి విస్ఫోటనం ప్లాన్ చేస్తుండవచ్చనేది ఊహకందని విషయం.
రాజమౌళి విసురుతున్న ఈ గ్లోబల్ ఛాలెంజ్ కేవలం భారతీయ దర్శకులకే పరిమితం కావడం లేదు. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్న నితీష్ తివారీ లేదా మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్, ప్రయోగాత్మక సినిమాలతో ప్రపంచాన్ని రక్తి కట్టిస్తున్న క్రిస్టోఫర్ నోలాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలకే జక్కన్న సవాల్ విసురుతున్నారా? అనిపిస్తోంది. భారతీయ పౌరాణిక ఇతిహాసాలను, భావోద్వేగాలను హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌కు జోడించి.. అంతర్జాతీయంగా మార్వెల్, డీసీ వంటి అతిపెద్ద హాలీవుడ్ ఫ్రాంచైజీలకు సవాల్ విసిరే ధైర్యం, దమ్ము ఒకే ఒక్క రాజమౌళికి మాత్రమే ఉన్నాయని ఇప్పుడు అభిమానులు, సినీ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. అతడి భవిష్యత్ ప్రణాళికల గురించి ఒక్కో లీకు సర్వత్రా ఉత్కంఠను పెంచుతున్నాయి.
మరోవైపు రాజమౌళి సృష్టిస్తున్న ఈ రికార్డులను అందుకోవడానికి బాలీవుడ్ ప్రముఖులు సైతం శ్రమిస్తున్నారు. `లవ్ అండ్ వార్` లాంటి భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో మళ్ళీ టాప్ లీగ్ డైరెక్టర్ల రేస్‌లోకి రావాలని సంజయ్ లీలా భన్సాలీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రతి కథలో లాజిక్, కంటెంట్, వినోదాన్ని సమపాళ్ళలో అందిస్తూ వరుస బ్లాక్‌బస్టర్లను ఇచ్చే రాజ్ కుమార్ హిరాణీ వంటి లాజికల్ దర్శకులు కూడా రాజమౌళి సవాల్‌ను స్వీకరించి ఈ గ్లోబల్ రేసులో నిలబడతారేమో చూడాల్సి ఉంది.
ఈ దిగ్గజాల సమరంలో సరికొత్త శకానికి ఊపిరి పోస్తూ దక్షిణాదికి చెందిన యువ దర్శకులు కూడా రేసులో సుకుమార్ కూడా ఉన్నారు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో సంచలనాలు సృష్టించిన సుకుమార్ తన తదుపరి సినిమాలను గ్లోబల్ రేంజులో తెరకెక్కించాలనే సన్నాహకాల్లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కచ్ఛితంగా కాంపిటీషన్ లో నిలవడంగానే చూడాలి. ఇక తమిళ పరిశ్రమ నుంచి మాస్ పల్స్ తెలిసిన అట్లీ ... LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో సరికొత్త లీగ్ సృష్టించిన లోకేష్ కనగరాజ్ వంటి యువ సంచలనాలు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్‌తో ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు మలచడంలో వీరు కూడా సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న తమ మార్కెట్ స్థాయిని రాజమౌళి చూపిస్తున్న బాటలో నడుస్తూ గ్లోబల్ రేంజ్‌కు చేర్చగల సమర్థత ఈ యువ దర్శకులకు కచ్చితంగా ఉంది. భారతదేశం నుంచి ప్రపంచ సినిమాను శాసించే దర్శకులలో రాజమౌళి లీడ్‌లో ఉన్నా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన దర్శకులు కూడా గ్లోబల్ రేసులో పోటీ పడటం భారతీయ సినిమాకు లభించిన గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఇది ఆరంభం మాత్రమేనని రాజమౌళి అన్నారు! అంటే, కచ్ఛితంగా ఆయన నుంచి డీసీ, మార్వల్ రేంజ్ సినిమాలను ప్రజలు ఆశించవచ్చు.
