Begin typing your search above and press return to search.

మ‌రోసారి విన‌మ్ర‌త చాటుకున్న ద‌ర్శ‌క‌దిగ్గ‌జం!

భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

By:  Srikanth Kontham   |   12 Oct 2026 7:56 PM IST
మ‌రోసారి విన‌మ్ర‌త చాటుకున్న ద‌ర్శ‌క‌దిగ్గ‌జం!
X

భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. `బాహుబలి`, `ఆర్.ఆర్.ఆర్` చిత్రాలతో టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టిన గ్లోబల్ డైరెక్టర్ తన పనితనంతో ఎంతటి ఎత్తుకు ఎదిగారో? వ్యక్తిత్వంలో అంతటి వినమ్రతను కాపాడుకుంటూ వస్తున్నారు. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. ప్రపంచమంతా రాజ‌మౌళి వైపు చూస్తున్న వేళ తన బర్త్‌డే వేడుకలకు .. పబ్లిసిటీకి ఏమాత్రం ప్రాధాన్యమివ్వకుండా జ‌క్క‌న్న‌ చూపిన లౌక్యం, సింప్లిసిటీ పరిశ్రమ వర్గాలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న అడ్వెంచర్ ప్రాజెక్ట్ `వారాణాసి` పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో జక్కన్న పుట్టినరోజున ఈ ప్రతిష్టాత్మక సినిమాకి సంబంధించి ఏదో భారీ అప్‌డేట్.. ఫస్ట్ లుక్ లేదా పోస్టర్ వస్తుందని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే అందరి అంచనాలను పక్కన పెడుతూ రాజమౌళి తన బర్త్‌డే రోజున `వారాణాసి` ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కనీసం చిన్న పోస్టర్‌ను కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. తన పుట్టినరోజును పబ్లిసిటీ కోసం వాడుకోవడానికి జ‌క్క‌న్న‌ అసలు ఇష్టపడలేదు.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న హీరో మహేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఏకంగా రెండు సర్ ప్రైజింగ్ పోస్టర్లను జక్కన్న టీమ్ విడుదల చేసింది. అలాగే ఇతర స్టార్ హీరోలు, నటీనటుల పుట్టినరోజుల సందర్భాల్లో కూడా సోషల్ మీడియాలో కొంత హడావుడి.. ప్రత్యేక పోస్టర్ల కోలాహలం క‌నిపించింది. కానీ ఆ మొత్తం ప్రాజెక్ట్‌కి మూలస్తంభమైన రాజమౌళి మాత్రం సొంత పుట్టినరోజు విషయంలో ఎలాంటి హంగామా లేకుండా ఎంతో వినమ్రంగా ఉండటానికి మొగ్గు చూపారు.

సినిమా అంటే దర్శకుడి పుట్టినరోజుల హడావుడి కాదని.. కంటెంట్ , సరైన సమయమే ప్రాధానమని రాజమౌళి నమ్ముతారు. వ్యక్తిగత వేడుకల కంటే సినిమా ప్రమోషన్లకు ఒక పద్ధతి, టైమింగ్ ఉండాలని భావించే జ‌క్క‌న్న‌ నైజం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడా ప్రచారం కోసం ఆరాట పడకుండా? పబ్లిసిటీ కంటే పనికే ప్రాధాన్యత ఇచ్చే రాజమౌళి నిజాయితీ ఆయన పట్ల గౌరవాన్ని మరింత పెంచుతుంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతకు రాజమౌళి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డుల వేదిక వరకు వెళ్లినా? తనలోని సాధారణత్వాన్ని, నమ్రతను ఆయన ఎక్కడా కోల్పోలేదు. కోట్లాది రూపాయల బడ్జెట్, వేల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను శాసించే దర్శకుడు అయినా? తన పుట్టినరోజున ఎలాంటి ప్రచారాన్ని ఆశించకపోవడం ఆయన గొప్పతనానికి, సంస్కారానికి నిదర్శనం.

ఆర్భాటాలకు దూరంగా సినిమాల ద్వారా మాత్రమే మాట్లాడే రాజమౌళి తీరు నేటి తరం మేకర్స్‌కు స్ఫూర్తి దాయకం. ప్రచారం వెనుక పరుగులు తీసే రోజుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నా? వినమ్రతతో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్న జక్కన్న నిజమైన దిగ్గజం అనిపించుకున్నారు. సింప్లిసిటీనే రాజ‌మౌళిని ఇండియన్ సినిమాలో అగ్రస్థానంలో నిలబెట్టిందని చెప్పడంలో సందేహం లేదు.