మహేష్ తర్వాత బన్నీకి ఛాన్సుందా! జక్కన్న మైండ్‌లో ఏం ఉంది
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్‌లోనే కాదు.. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా ఒక సంచలనం. టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్ అందరినీ తన సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం.
By: Sivaji Kontham | 3 July 2026 8:00 AM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్‌లోనే కాదు.. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా ఒక సంచలనం. టాలీవుడ్‌లోని టాప్ స్టార్స్ అందరినీ తన సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సరికొత్త రికార్డులు సృష్టించిన రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తదుపరి భారీ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ టాప్ లీగ్‌లో ఉన్న హీరోలందరిలో రాజమౌళితో ఇప్పటివరకు సినిమా చేయని ఏకైక పెద్ద స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత బన్నీకి ఛాన్స్ దక్కుతుందా? అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
నిజానికి అల్లు అర్జున్ తనను తాను ఒక గ్లోబల్ స్టార్‌గా... నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నటుడిగా ఎప్పుడో నిరూపించుకున్నారు. `పుష్ప` ఫ్రాంఛైజీతో నార్త్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఉత్తమ నటుడిగా.. `జాతీయ అవార్డు` అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు. తనదైన మేనరిజమ్స్, అద్భుతమైన నటన, డాన్సులతో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను సైతం అలరిస్తున్న అల్లు అర్జున్ రేంజ్.. కచ్చితంగా రాజమౌళి మార్క్ లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాకపోవడం వెనుక ఇండస్ట్రీలో ఒక బలమైన ప్రచారం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై వచ్చిన `మగధీర` చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత అల్లు అరవింద్‌కు - రాజమౌళికి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ (అభిప్రాయ బేధాలు) వచ్చాయనే టాక్ ఉంది. ఆ కారణంగానే రాజమౌళి ఆ తర్వాత అల్లు కాంపౌండ్ హీరో అయిన అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదనే రూమర్స్ గతంలో గట్టిగా వినిపించాయి. ఈ వివాదం వల్లే ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఇన్నేళ్లుగా పట్టాలెక్కలేదని అంటుంటారు.
కానీ కాలంతో పాటే సమీకరణాలు మారుతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. `మగధీర` నాటి విషయాలను పక్కన పెడితే.. రాజమౌళి కూడా అల్లు అర్జున్ ఎదుగుదలను.. అతడి హార్డ్ వర్క్- డెడికేషన్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను పలు సందర్భాల్లో అభినందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ సాధించినప్పుడు .. గ్లోబల్ వైడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు టాలీవుడ్ గర్వించదగ్గ నటుడిగా బన్నీని గుర్తించారు. కాబట్టి పాత పట్టింపులను పక్కన పెట్టి... తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేందుకు వీరిద్దరూ చేతులు కలిపే సమయం ఆసన్నమైందని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. రాజమౌళి పూర్తి ఫోకస్ మహేష్ బాబు సినిమాపైనే ఉంది. మహేష్ `వారణాసి` 2027లో విడుదల కానుంది. ఆ తర్వాత రాజమౌళి తదుపరి చిత్రానికి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతారని ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇరువురి అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఐకాన్ స్టార్‌కి రాజమౌళి సెట్ అయితే.. అది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించడం ఖాయం. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో చూడాలి!
