ఉబర్ డ్రైవర్ గా పనిచేయడం వెనుక అసలు నిజం ఇదే - ప్రొడ్యూసర్ సృజన్!
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా కోసం ఉబర్ డ్రైవర్‌గా పనిచేసిన నిర్మాత సృజన్ యారబోలు తన అనుభవంపై స్పందించారు. టీమ్‌తో మాట్లాడేందుకు బయటకు వెళ్లినప్పుడు ఖాళీగా ఉండటం ఎందుకని క్యాబ్ నడిపానని, షూటింగ్‌కు అవసరమైన డబ్బును లాంగ్ ట్రిప్స్ ద్వారా సమకూర్చానని తెలిపారు. ఇందులో సింపతి చూపించాల్సిన విషయం ఏమీ లేదని స్పష్టం చేశారు.
By: Madhu Reddy | 19 Nov 2026 8:30 AM ISTప్రముఖ సినీ నిర్మాత సృజన్ యారబోలు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో చిత్రాలు నిర్మిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. 'యస్ ఒరిజినల్స్ బ్యానర్' పై పలు భాషలలో సినిమాలు నిర్మిస్తున్న సృజన్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఈ నగరానికి ఏమైంది రిపీట్. నవంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సృజన్ పై అటు తరుణ్ భాస్కర్ ఇటు దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నగరానికి ఏమైంది రిపీట్ 2 సినిమా షూటింగ్ సమయంలో డబ్బులు తక్కువ రావడంతో నిర్మాత ఉబర్ డ్రైవర్ గా మారి అలా పనిచేసిన డబ్బులతో సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆయన లాంటి నిర్మాతను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు.. ఆయన చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ ప్రశంసల వెనుక అసలు కారణం గురించి స్పందించి సృజన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సృజన్ మాట్లాడుతూ.. నేను ఉబర్ డ్రైవర్ గా పనిచేశానని తెలిసి చాలామంది నాపై సింపతి చూస్తున్నారు. దయచేసి దీనిని సింపతి డ్రామా లాగా చూడొద్దు.
ఇండియాలో ఉదయం పని మొదలయ్యే సమయానికి అమెరికాలో రాత్రి తొమ్మిది అవుతుంది. ఆ సమయంలో నేను ఇక్కడ ఈ నగరానికి ఏమైంది రిపీట్ టీం తో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే నా వాయిస్ కొంచెం పెద్దది. పైగా సినిమా టీంతో ఆ టైంలో నేను ఇంట్లో మాట్లాడితే నా భార్య పిల్లలు డిస్టర్బ్ అవుతారు. అందుకే బయటకు వచ్చి కారులో ప్రయాణిస్తూ టీం తో సినిమా గురించి మాట్లాడేవాడిని. అయితే ఖాళీగా ఎందుకు ఇలా వెళ్లడం అనిపించింది. అందుకే ఉబర్ క్యాబ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టాను..
ఈ సినిమా షూటింగు సంబంధించి ఒక షెడ్యూల్ కి డబ్బులు అవసరమైతే ఇలా లాంగ్ ట్రిప్ వేసి ఆ డబ్బులు ఇచ్చాను. ఇదంతా సరదాగా , ఆసక్తితో చేసిందే తప్పా.. ఇందులో ఎటువంటి బాధాకరమైన స్టోరీ లేదు.. దయచేసి దీనిని సింపతి కోణంలో చూడకండి. అంటూ సృజన్ చాలా సృజనాత్మకంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఏది ఏమైనా సృజన్ పట్ల సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న సింపతికి ఒక్క మాటతో ఆయన క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.
ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా విషయానికి వస్తే.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను , సాయినాథ్ మాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా 2 గంటల 43 నిమిషాల నిడివితో లాక్ చేశారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
