ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ఎవరు?
టాలీవుడ్ స్టార్లు సరిహద్దులను చెరిపేసి అన్ని భాషల్లోకి దూసుకెళుతున్నారు. భాష, ప్రాంతం, హద్దులతో సంబంధం లేకుండా అన్నిచోట్లా అభిమానులను సంపాదించుకున్నారు.
By: Sivaji Kontham | 2 Nov 2025 9:48 PM ISTటాలీవుడ్ స్టార్లు సరిహద్దులను చెరిపేసి అన్ని భాషల్లోకి దూసుకెళుతున్నారు. భాష, ప్రాంతం, హద్దులతో సంబంధం లేకుండా అన్నిచోట్లా అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు సినీప్రముఖుల్లో బాహుబలి స్టార్ గా సుప్రసిద్ధుడు అయిన ప్రభాస్ కి దేశవిదేశాలలో భారీ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. రోజుకు 100-200 కోట్ల మధ్య వసూలు చేయగల సత్తా ఉన్న స్టార్ గా నిరూపించాడు.
అందుకే ఇటీవల సందీప్ రెడ్డి వంగా `ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్` (India’s Biggest Superstar) అంటూ ప్రభాస్ ని చాలా సముచితంగా గౌరవించాడు. `స్పిరిట్` టీజర్‌లో ఈ ట్యాగ్ ని జోడించి భారతీయ సినీపరిశ్రమలో కొత్త చర్చకు తెర లేపాడు. అయితే సందీప్ వంగా ఈ ట్యాగ్‌ని అంతగా పరిశోధన లేకుండా జోడించలేదు. ఇటీవలి కాలంలో బాలీవుడ్ మీడియాలు, జాతీయ మీడియా కూడా ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్లను భారతీయ సూపర్ స్టార్లుగా గౌరవిస్తున్నాయి. ఈ ఆనందాన్ని సదరు స్టార్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఇలాంటి సమయంలో `కింగ్` టీజర్ తో వచ్చాడు సిద్ధార్థ్ ఆనంద్. ఈ టీజర్ లో షారూఖ్ ని హైప్ చేస్తూ ఎలాంటి బిరుదులు, ట్యాగులను జోడించలేదు. కానీ సిద్ధార్థ్ ఎక్స్ ఖాతాలో `ఇండియాస్ కింగ్` (INDIA’s KING) అంటూ షారూఖ్ గురించి ప్రస్థావించాడు. నిజమే.. దీనిని ప్రజలంతా అంగీకరిస్తారు. షారూఖ్ దశాబ్ధాలుగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు. కానీ అంతకంటే వేగంగా ప్రభాస్ తన స్టార్ డమ్ ని విశ్వవ్యాప్తం చేయడంలో సఫలమయ్యాడు. అందుకే ఇప్పుడు `ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్` అనే బిరుదు ప్రభాస్ కి సరిపోతుందని అందరూ అంగీకరించాలి. అయితే ప్రభాస్ కోసం సందీప్ ఎంపిక చేసిన ట్యాగ్ ని గమనించిన షారూఖ్ అభిమానులు ఇది సరికాదని చిన్నబుచ్చుకున్నారు. అయితే ప్రభాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినప్పుడు షారూఖ్ కాకూడదు! అనే ఉద్ధేశం ఎవరికీ లేదు. షారూఖ్, ప్రభాస్ ఎవరికి వారు దేశం గర్వించదగిన నటులు, దేశంలో అతిపెద్ద స్టార్లు అనడంలో సందేహం లేదు. ప్రభాస్ ని పెంచడం అంటే, షారూఖ్ ని తగ్గించడం అని అర్థం కాదు! భారతదేశంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ కనీసం 20 మంది హీరోలు `సూపర్ స్టార్` హోదాకు ఎదిగారు. స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నారు. ఈరోజు షష్ఠిపూర్తి జరుపుకున్న కింగ్ ఖాన్ కి శుభాకాంక్షలు.
