బ్రాడ్ పిట్‌ని కాపీ కొడితే ఎలా కింగ్?
ఇటీవల షారూఖ్ పుట్టినరోజు సందర్భంగా 'కింగ్' లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో ఖాన్ ని కొత్తగా చూపించాలని తపిస్తున్నాడని అర్థమైంది.
By: Sivaji Kontham | 5 Nov 2025 12:28 PM ISTఇటీవల షారూఖ్ పుట్టినరోజు సందర్భంగా 'కింగ్' లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో ఖాన్ ని కొత్తగా చూపించాలని తపిస్తున్నాడని అర్థమైంది. షారూఖ్ ఈ కొత్త లుక్ లో ఎంతో ఎనర్జీతో యూనిక్‌గా కనిపించాడని, అతడి వయసు చాలా తగ్గిపోయిందని ప్రశంసలు కురిసాయి.
అయితే చాలా మంది షారూఖ్ లుక్ ని ఎక్కడి నుంచి కాపీ చేశారో కనిపెట్టేందుకు ఇంటర్నెట్ ని జల్లెడ పట్టారు. ఈ పరిశోధనలో అతడు హాలీవుడ్ కింగ్ బ్రాడ్ ఫిట్ 'ఎఫ్ 1' మూవీ లుక్ ని కాపీ కొట్టారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఫార్ములా వన్ సినిమాతో ఇటీవల బ్రాడ్ ఫిట్ అంతర్జాలంలో ఎక్కువగా చర్చించిన స్టార్ గా రికార్డులకెక్కాడు. ఎఫ్1 భారతదేశం నుంచి చక్కని కలెక్షన్లు సాధించింది. అందుకే ఈ రెండు లుక్ లను పక్క పక్కనే పెట్టి నెటిజనులు స్క్రుటినీ చేసారు. చూడటానికి కింగ్ అచ్చం బ్రాడ్ లా కనిపించాడు. అతడి హెయిర్ కట్, ఎంపిక చేసుకున్న టాన్ దుస్తులు సహా ప్రతిదీ కాపీ కొట్టాడని చాలా మంది భావించారు.
షారుఖ్ ఖాన్ నీలిరంగు చొక్కా - టాన్ జాకెట్ లో కనిపించగా, ఎఫ్1లో బ్రాడ్ పిట్ దుస్తులతో పోల్చడానికి ఎవరూ వెనకాడలేదు. కొందరు ప్రేరణ పొందారని సమర్థించగా, మరికొందరు కాపీ చేసారని విమర్శించారు. కింగ్ లుక్ పై మీమ్స్, జోకులు, థ్రెడ్‌లు వైరల్ గా మారాయి. ఈరోజుల్లో టాప్ గన్, టైటానిక్, ఎఫ్ 1 వంటి సినిమాలకు కాపీ అంటూ విమర్శించడం అలవాటైపోయిందని ఒక నెటిజన్ ఖాన్ టీమ్ ని సమర్థిస్తూ మాట్లాడారు.
అయితే వీటన్నిటికీ సిద్ధార్థ్ ఆనంద్ ధీటుగా స్పందించారు. అతడు నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసి `సరే` అనే గుర్తుతో ప్రతిస్పందించారు. కాపీ ఆరోపణలపై ఆశ్చర్యపోలేదని సిధ్ హింట్ ఇచ్చాడు. కింగ్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ -మార్ ప్లిక్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, సుహానా ఖాన్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లావత్ తదితరులు నటిస్తున్నారు. 2026లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
