35 ఏళ్లు ఎదురు చూసాను.. సూపర్‌స్టార్ ఆవేదన
ఇటీవల అట్లీ దర్శకత్వం వహించిన `జవాన్` చిత్రంలో నటనకు గాను షారూఖ్ కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది.
By: Sivaji Kontham | 4 Nov 2025 9:51 AM ISTకింగ్ ఖాన్ షారూఖ్ ఏళ్లుగా తన అద్భుత నటనతో వినోదం పంచుతున్నారు. కెరీర్ లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, రికార్డ్ బ్రేకింగ్ హిట్లు అందుకున్నాడు. కానీ ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడానికి దాదాపు మూడున్నర దశాబ్ధాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. తనకు అవార్డు రానందుకు ప్రారంభంలో చాలా బాధపడేవాడిని అని షారూఖ్ గుర్తు చేసుకున్నారు. సినీపరిశ్రమలో అవార్డులు మాత్రమే ప్రోత్సాహకం.. వేరే గుర్తింపు ఏదీ ఉండదు.. అందుకే బాధపడ్డానని అన్నారు. కాలక్రమంలో అవార్డుల కంటే, మనతో ఉండే వ్యక్తుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహం ఉంటే చాలునని అనుకున్నాను.. అని ఖాన్ తెలిపారు.
ఇటీవల అట్లీ దర్శకత్వం వహించిన `జవాన్` చిత్రంలో నటనకు గాను షారూఖ్ కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. `ట్వల్త్ ఫెయిల్` నటుడు విక్రాంత్ మాస్సేతో కలిసి ఉత్తమ నటుడి అవార్డును షారూఖ్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన 60వ పుట్టినరోజు వేడుకల వేళ కింగ్ టీజర్ లాంచ్ లో అభిమానులతో సమావేశంలో షారూఖ్ మాట్లాడుతూ.. తాను అవార్డుల కోసం ఎంతగా తపించేవాడో గుర్తు చేసుకున్నాడు. అవార్డు రానందుకు నిరాశ చెందానని నిజాయితీగా అంగీకరించాడు.
తాను తన కెరీర్ ప్రారంభమైన తర్వాత 35 సంవత్సరాలకు జాతీయ అవార్డ్ అందుకున్నానని ఖాన్ అన్నారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చాక నాకు అవార్డులు చాలా ఇష్టమని గ్రహించాను.. 10-15 సంవత్సరాల క్రితం నేను అవార్డు రాలేదని బాధపడ్డాను. ఎందుకంటే నేను ప్రతి ప్రాజెక్ట్‌లో బాగా నటిస్తానని భావిస్తాను. కొన్నిసార్లు నా పనికి సరైన ప్రోత్సాహం లభించనందుకు బాధపడ్డాను.. అని షారూఖ్ అన్నారు. ప్రతి నటుడికి గుర్తింపు అవసరం. సినిమాలకు వేరే దారి లేదు. పదిహేనేళ్ల క్రితం నేను బాధపడ్డా కానీ, తన పనిని అందరూ ఇష్టపడితే చాలునని అనుకున్నాను. ఆపై అవార్డు వచ్చినా రాకపోయినా నన్ను ప్రేమించే వారిని కలుసుకుంటే చాలు అనుకున్నాను అని బాద్ షా అన్నారు.
స్వదేశ్ లో నటనకుగాను నాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కుతుందని అశుతోష్ గోవారికర్ భావించారు. కానీ పురస్కారం దక్కలేదు. ఇప్పుడు నాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వలె అనేక జాతీయ అవార్డులు కావాలి అని కూడా షారూఖ్ అన్నారు.
చక్ దే ఇండియా ఆయనకు నివాళి:
తన తండ్రి హాకీ ప్లేయర్ అని.. తాను కూడా హాకీ ఆడానని షారూఖ్ అభిమానుల సమావేశంలో తెలిపారు. చక్ దే ఇండియా సినిమాలో తాను నటించడానికి కారణం తన తండ్రికి నివాళి ఇవ్వడం కోసమేనని అన్నారు. నేను హాకీ ఆడేవాడిని, నాన్న కూడా ఆడేవాడు. నిజంగా భారతదేశం తరపున ఆడాలని కోరుకున్నాను. కానీ అలా జరగనందుకు బాధపడ్డాను అని షారూఖ్ తెలిపారు.
ఒక విధంగా నేను నటుడిని కావడం మంచిది. కానీ నా తండ్రి కోసం ఈ సినిమా చేస్తానని ఆదిత్య చోప్రాతో చెప్పడం నాకు గుర్తుంది. అమ్మాయిలు అంతా మంచివారు .. వారితో సినిమా కోసం హాకీ ఆడటం బాగుంది.. అని షారూఖ్ అన్నారు.
షారూఖ్ ప్రస్తుతం తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది.
