వైట్ల చేతిలో 100% హిట్టు కొట్టే కథ
ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీను వైట్ల పరిస్థితి చూస్తుంటే సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆశ్చర్యం కలగకమానదు.
By: M Prashanth | 8 Dec 2025 8:00 PM ISTప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీను వైట్ల పరిస్థితి చూస్తుంటే సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆశ్చర్యం కలగకమానదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన దర్శకుడు, ఇప్పుడు కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. 'విశ్వం' ఫలితం తర్వాత వైట్ల పని అయిపోయిందని, ఇక ఆయన నుంచి మ్యాజిక్ ఆశించడం దండగని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ అందరూ ఆయన్ని తక్కువ అంచనా వేస్తున్న సమయంలో, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల గురించి మాట్లాడుతూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. వైట్ల పని ఇంకా అయిపోలేదని, ఆయన దగ్గర ఒక అద్భుతమైన కథ రెడీగా ఉందని రివీల్ చేశారు. "ఆయన కొత్త సినిమా కథ మామూలుగా ఉండదు.. అది వంద శాతం హిట్ మెటీరియల్" అని అనిల్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. వరుస డిజాస్టర్లలో ఉన్న ఒక దర్శకుడిపై నిర్మాతకు ఇంత నమ్మకం ఉండటం నిజంగా విశేషం.
అసలు అనిల్ సుంకర ఇంత గట్టిగా భరోసా ఇవ్వడానికి కారణం కేవలం సినిమా వ్యాపారం మాత్రమే కాదు. వీరిద్దరి మధ్య 90వ దశకం నుంచి ఉన్న బలమైన స్నేహం. తాను అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్న సమయంలో, సినిమాల్లోకి రావడానికి ప్రేరణ ఇచ్చింది శ్రీను వైట్లనే అని అనిల్ గుర్తుచేసుకున్నారు. ఆ కృతజ్ఞత, ఆ నమ్మకమే ఇప్పుడు వైట్ల కష్టకాలంలో ఉన్నా ఆయనకు అండగా నిలబడేలా చేస్తోంది. కేవలం గతం ఉంది కదా అని సపోర్ట్ చేయడం లేదు, వైట్ల రాసిన కొత్త కథలో అంత దమ్ము ఉండబట్టే 'కమ్ బ్యాక్' గ్యారెంటీ అని చెబుతున్నారు.
ఇదే సందర్భంలో ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో నలుగుతున్న '14 రీల్స్' వివాదంపై కూడా అనిల్ క్లారిటీ ఇచ్చారు. రామ్ ఆచంట, గోపీ ఆచంటలతో విడిపోవడానికి కారణం గొడవలు కాదని, కేవలం బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే అని స్పష్టం చేశారు. 14 రీల్స్ లో ఉన్నప్పుడు తాము ముగ్గురం కలిసి భారీ బడ్జెట్ సినిమాలు చేసేవామని, అయితే రామ్, గోపీలు మిడ్ రేంజ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడంతో దారులు మారాయని వివరించారు.
అంతే తప్ప తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని, తాను 'ఏకే ఎంటర్టైన్మెంట్స్' ద్వారా చిన్న సినిమాలు, వారు మిడ్ రేంజ్ సినిమాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికీ కథల విషయంలో ఒకరికొకరు సలహాలు తీసుకుంటామని, రామ్ జడ్జిమెంట్ మీద తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పడం ద్వారా రూమర్లకు చెక్ పెట్టారు.
ఇక శ్రీను వైట్ల తన పాత పంథా మార్చుకుని, ఫ్రెండ్ అనిల్ సుంకర నమ్మకాన్ని నిలబెట్టేలా ఒక సాలిడ్ స్క్రిప్ట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. 'దూకుడు' సమయంలో ఎలాగైతే ఇండస్ట్రీని షేక్ చేశారో, ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారని అనిల్ ధీమాగా ఉన్నారు. మరి ఆ వజ్రాయుధం లాంటి కథతో వైట్ల బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సౌండ్ చేస్తారో వేచి చూడాలి.
