Begin typing your search above and press return to search.

యూ/ఏ సర్టిఫికెట్.. ప్రేమకథలకు బాక్సాఫీస్‌లో నిజంగానే ఎక్స్‌ట్రా బూస్ట్ అవుతుందా?

సినిమా రిలీజ్ కు ముందు ఆడియ‌న్స్ లో ఆసక్తిని పెంచే అంశాలు చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్, స్టార్ క్యాస్ట్, డైరెక్ట‌ర్ క్రేజ్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వాటిలో ఒకటిగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 July 2026 3:23 PM IST
యూ/ఏ సర్టిఫికెట్.. ప్రేమకథలకు బాక్సాఫీస్‌లో నిజంగానే ఎక్స్‌ట్రా బూస్ట్ అవుతుందా?
X

సినిమా రిలీజ్ కు ముందు ఆడియ‌న్స్ లో ఆసక్తిని పెంచే అంశాలు చాలా ఉంటాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్, స్టార్ క్యాస్ట్, డైరెక్ట‌ర్ క్రేజ్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వాటిలో ఒకటిగా మారింది. ముఖ్యంగా ల‌వ్ స్టోరీలు, ఎమోష‌న్స్ కు ప్రాధాన్యం ఉన్న సినిమాల విష‌యంలో సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ రావడం బాక్సాఫీస్ పరంగా సానుకూల సంకేతంగా పరిశ్రమ వర్గాలు భావిస్తుంటాయి. తాజాగా జులై 30న రిలీజ్ కు రెడీ అవుతున్న శ్రీనివాస మంగాపురం కూడా యూ/ఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకోవడం ఈ డిస్క‌ష‌న్‌కు మరోసారి ఊతమిచ్చింది.




యూ/ఏ సర్టిఫికెట్ అంటే కేవలం ఏజ్ లిమిట్ మాత్రమే కాదు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ తో పాటు యూత్ కూడా థియేటర్లకు వచ్చే అవకాశాన్ని పెంచే అంశంగా దీన్ని ట్రేడ్ విశ్లేషకులు చూస్తుంటారు. ముఖ్యంగా ప్రేమ, ఫ్యామిలీ ఎమోష‌న్స్, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందిన సినిమాలకు ఈ సర్టిఫికెట్ భారీ ప్రేక్షక వర్గాన్ని చేరుకునే అవకాశం కల్పిస్తుందని అభిప్రాయప‌డుతున్నారు.

శ్రీనివాస మంగాపురం విషయంలో మరో ఆసక్తికర అంశం డైరెక్ట‌ర్ అజయ్ భూపతి. ఆర్‌ఎక్స్100 లో ప్రేమను తీవ్ర భావోద్వేగాలతో, మంగళవారం సినిమాలో మానసిక సంఘర్షణలు, థ్రిల్లర్ అంశాలతో చూపించిన ఆయన ఈసారి మళ్లీ ప్రేమకథ వైపు అడుగులు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకే తరహా కథలను కాకుండా ప్రతి సినిమాలో ప్రేమను కొత్త కోణంలో చూపించాలనే ప్రయత్నం ఆయన రచనా శైలిలో కనిపిస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. అందుకే ఈసారి ఆయన ఎంచుకున్న నేపథ్యం, క్యారెక్ట‌ర్ల మ‌ధ్య ఎమోష‌న్స్ ఎలా ఉండబోతాయన్న ఆసక్తి పెరిగింది.

ఆల్రెడీ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. అయితే డిజిటల్ వేదికలపై కనిపించే ఆదరణ బాక్సాఫీస్ స‌క్సెస్ గా మారుతుందా లేదా అనేది మాత్రం సినిమా రిలీజ్ త‌ర్వాతే తేల‌నుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధించకపోగా, పెద్దగా ప్ర‌మోష‌న్స్ లేకుండా వచ్చిన సినిమాలు ఆడియ‌న్స్ మౌత్ టాక్‌తో స‌క్సెస్ లు అందుకున్నాయి. అందుకే ఆన్‌లైన్ రెస్పాన్స్ ను తొలి సూచికగా మాత్రమే చూడాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమా తిరుపతి నేపథ్యాన్ని ఎంచుకోవడం కూడా ఆసక్తిని పెంచుతోంది. తిరుపతి పరిసరాలు, అక్కడి సంస్కృతి, స్థానిక భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని వచ్చిన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కథతో ఆ నేపథ్యం సహజంగా మిళితమైతే సినిమాను ఆడియ‌న్స్ మ‌రింత క‌నెక్ట్ అయ్యే అవ‌కాశ‌ముంది. మొత్తంగా చూస్తే, యూ/ఏ సర్టిఫికెట్ రావడం శ్రీనివాస మంగాపురంకు ఒక సానుకూల అంశమే అయినప్పటికీ, చివరికి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్లేది కథ, ఎమోష‌న్స్, డైరెక్ట‌ర్ టేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్సే. అజయ్ భూపతి మరోసారి తనదైన శైలిలో ప్రేమను ఎంత కొత్తగా ఆవిష్కరించారన్నదే ఈ సినిమా స‌క్సెస్ ను డిసైడ్ చేసే ప్రధాన అంశంగా మారనుంది.