డైలాగ్ కింగ్ ఈజ్ బ్యాక్.. ఈసారి 'వెంకటప్పయ్య నాయుడు'
లేటెస్ట్ గా విడుదలైన పోస్టర్‌లో మోహన్ బాబు లుక్ చూస్తుంటే పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది.
By: M Prashanth | 28 Feb 2026 1:11 PM ISTటాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి అంటేనే ఒక రకమైన ఇంటెన్సిటీ గుర్తొస్తుంది. ‘RX100’, మంగళవారం సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ దర్శకుడు, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే, అజయ్ ఈసారి ఏదో పెద్ద స్కెచ్ వేసినట్లే కనిపిస్తోంది.
ముఖ్యంగా నటీనటుల ఎంపిక విషయంలో తీసుకుంటున్న కేర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. జోడీగా రవీనా టాండన్ కుమార్తె రాషా టడాని నటిస్తోంది. అయితే ఈ యంగ్ పేయిర్‌కి తోడుగా సినిమాలో ఒక వెరీ వెరీ స్పెషల్ క్యారెక్టర్ ఉండబోతోంది. ఆ క్యారెక్టరే ఇప్పుడు సినిమాకు మెయిన్ పిల్లర్‌గా మారబోతోందని టాక్. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రివీల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన పోస్టర్‌లో మోహన్ బాబు లుక్ చూస్తుంటే పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. తెల్లటి కుర్తా, ధోతీ కట్టుకుని.. మెడలో గొలుసులు, చేతికి వాచ్ పెట్టుకుని ఒక పక్కా విలేజ్ పెద్దరికం ఉట్టిపడేలా ఆయన కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో ఉన్న ఆ ఇంటెన్సిటీ, సీరియస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే ఈ సినిమాలో విశ్వరూపం చూపించబోతున్నారని అర్థమవుతోంది.
ఈ పోస్టర్‌లో మోహన్ బాబు వెనుక ఒక గ్యాంగ్ మొత్తం నాటు తుపాకులు పట్టుకుని నడుచుకుంటూ వస్తుండటం మరో హైలెట్. చూస్తుంటే సినిమాలో ఆయన ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మెరిసిపోబోతున్నట్లు తెలుస్తోంది. అజయ్ భూపతి మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌లో మోహన్ బాబు డైలాగ్ డెలివరీ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. చాలా కాలం తర్వాత మోహన్ బాబు తనదైన గంభీరమైన మేనరిజమ్స్ తో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యారు.
టెక్నీకల్ గా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, జయకృష్ణ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రియల్ సతీష్ పని చేస్తుండటంతో, సినిమాలో ఇంటెన్స్ ఫైట్స్ కూడా గట్టిగానే ఉండేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
‘శ్రీనివాస మంగాపురం’ ద్వారా అజయ్ భూపతి మరో కల్ట్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. జయకృష్ణ వంటి కొత్త హీరోకి మోహన్ బాబు వంటి సీనియర్ యాక్టర్ తోడవ్వడం సినిమాకి పెద్ద ఎసెట్. మోహన్ బాబు మార్క్ మ్యానరిజమ్స్, అజయ్ భూపతి విజన్ కలిసి ఈ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తాయో చూడాలి. ఫస్ట్ లుక్ తోనే అదిరిపోయే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వెంకటప్పయ్య నాయుడు, స్క్రీన్ మీద ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
