Begin typing your search above and press return to search.

జయకృష్ణ డెబ్యూ యాక్షన్ గ్లింప్స్.. సర్ ప్రైజ్ ఎలా ఉందంటే..

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా వస్తుండటంతో శ్రీనివాస మంగాపురం మూవీపై మొదటి నుంచే సూపర్ బజ్ నెలకొంది.

By:  M Prashanth   |   31 May 2026 1:40 PM IST
జయకృష్ణ డెబ్యూ యాక్షన్ గ్లింప్స్.. సర్ ప్రైజ్ ఎలా ఉందంటే..
X

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా వస్తుండటంతో శ్రీనివాస మంగాపురం మూవీపై మొదటి నుంచే సూపర్ బజ్ నెలకొంది. కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ఆ చిత్రాన్ని ఆర్‌ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు.




ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించగా, తాజాగా విడుదలైన యాక్షన్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదలైన ఆ గ్లింప్స్‌ లో జయకృష్ణను యాక్షన్ మోడ్‌ లో చూపించారు. 'నేను సాధారణంగా ఎవరికి జోలికి వెళ్లను.. కానీ నా జోలికి వస్తే మాత్రం...' అనే డైలాగ్‌ తో ప్రారంభమైన గ్లింప్స్.. యాక్షన్ ఎపిసోడ్స్‌ తో అదిరిపోయింది. జయకృష్ణ స్క్రీన్‌ పై కనిపించిన తీరు, ఫైట్ సీక్వెన్స్‌ ల్లో చూపించిన ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

డెబ్యూ హీరో అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించకుండా, యాక్షన్ సీన్స్ లో జయకృష్ణ మంచి కాన్ఫిడెన్స్ తో నటించినట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం కనిపించింది. కొన్ని షాట్స్ లో ఘట్టమనేని కుటుంబానికి చెందిన స్క్రీన్ ప్రెజెన్స్‌ ను గుర్తు చేసే అంశాలు కూడా కనిపిస్తున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అజయ్ భూపతి తన మార్క్ మేకింగ్‌ ను మరోసారి చూపించినట్లు గ్లింప్స్ చెబుతోంది. ప్రేమ, ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ను ప్యారలల్ గా మిక్స్ చేసే ప్రయత్నం సినిమాలో కనిపించబోతుందని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ లో లవ్ స్టోరీ కనిపించగా, ఇప్పుడు యాక్షన్ యాంగిల్ ను పరిచయం చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది.

జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ కు మెయిన్ అసెట్ గా నిలిచింది. యాక్షన్ సీన్స్ ఇంటెన్సిటీ పెంచడంలో ఆయన వర్క్ కీలక పాత్ర పోషించింది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు క్లియర్ గా చెబుతున్నాయి. ఇక గ్లింప్స్ చివర్లో కనిపించిన ఎమోషనల్ మూమెంట్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసే విజువల్‌ ను చూపిస్తూ, ఆయన ఆశీర్వాదం పొందుతున్నట్లు జయకృష్ణ చేతులతో నమస్కరించే సీన్ ఘట్టమనేని అభిమానులను ఆకట్టుకుంది.

అది కేవలం ఒక సినిమా ప్రమోషన్ సీన్‌ గా కాకుండా, కుటుంబ వారసత్వానికి ట్రిబ్యూట్ గా నిలిచింది. ఇక సినిమాలో హీరోయిన్‌ గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తుండగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అప్పుడు టీజర్, ఇప్పుడు యాక్షన్ గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్ రాగా..శ్రీనివాస మంగాపురం జయకృష్ణకు సరైన లాంఛింగ్ మూవీగా మారేలా ఉంది. జులై 9న విడుదల కానున్న ఆ చిత్రం ఎంతటి హిట్ అవుతుందో వేచి చూడాలి.