మరోసారి హలో బ్రదర్.. ఎందుకు ఆగిపోయింది?
అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్రాఫిక్స్ హంగులతో వచ్చిన సినిమా 'డమరుకం'. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డి పేరు అప్పట్లో ఇండస్ట్రీలో మారుమోగింది.
By: M Prashanth | 7 Nov 2025 10:30 AM ISTఅక్కినేని నాగార్జున కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్రాఫిక్స్ హంగులతో వచ్చిన సినిమా 'డమరుకం'. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డి పేరు అప్పట్లో ఇండస్ట్రీలో మారుమోగింది. అయితే, అంత పెద్ద హిట్ తర్వాత ఆయనకు మళ్లీ ఆ రేంజ్ అవకాశాలు రాలేదా? లేక ఆయనే గ్యాప్ తీసుకున్నారా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. 'డమరుకం' తర్వాత శ్రీనివాస్ రెడ్డి దాదాపు రెండేళ్ల పాటు మరో సినిమా చేయకపోవడంతో రకరకాల పుకార్లు వ్యాపించాయి.
అయితే, ఆ గ్యాప్‌కు అసలు కారణం వేరని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గతంలో ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'డమరుకం' సినిమా విడుదలైన రోజే తనకు పెద్ద ఆఫర్ వచ్చిందని, కానీ అదే రోజు నాగార్జున గారు తనను పిలిచి నాగ చైతన్యతో ఒక సినిమా చేయమని అడిగినట్లు తెలిపారు. తనకు 'డమరుకం' లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చిన నాగార్జున మాటకు విలువ ఇచ్చి, చైతన్యతో సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నానని అన్నారు.
అలా అనౌన్స్ అయిన ప్రాజెక్టే నాగార్జున క్లాసిక్ హిట్ 'హలో బ్రదర్' రీమేక్. నాగ చైతన్య డ్యూయల్ రోల్‌లో, సమంత, తమన్నా హీరోయిన్లుగా కామాక్షి మూవీస్ బ్యానర్‌పై శివప్రసాద్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా స్క్రిప్ట్‌పై దాదాపు 10 నెలల పాటు కష్టపడి పనిచేశామని, చైతన్యకు డ్యూయల్ రోల్ కోసం రిహార్సల్స్ కూడా చేయించామని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
అంతా సిద్ధమై, సెట్స్ పైకి వెళ్లాల్సిన సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆయన తెలిపారు. దీనికి కారణం ఎలాంటి వివాదాలు కావని, అప్పటికే నిర్మాత శివప్రసాద్ రెడ్డి గారు మరో సినిమాతో రన్నింగ్‌లో ఉన్నారని, అంతకు ముందు సినిమా కూడా కొంచెం అటుఇటు అయ్యిందని అన్నారు. 'హలో బ్రదర్' రీమేక్‌కు అనుకున్న బడ్జెట్‌కు, వాస్తవ బడ్జెట్‌కు తేడా వస్తుండటంతో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్‌ను ఆపేశారని క్లారిటీ ఇచ్చారు.
ఈ 'హలో బ్రదర్' రీమేక్ కోసం 10 నెలలు, ఆ తర్వాత నాగ చైతన్యతోనే ప్లాన్ చేసిన 'దుర్గ' అనే మరో సినిమా కోసం 8 నెలలు.. ఇలా ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోవడం వల్లే తన కెరీర్‌లో రెండేళ్ల గ్యాప్ వచ్చిందని శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఈ గ్యాప్‌లో 'డమరుకం' ఆడలేదని, అందుకే శ్రీనివాస్ రెడ్డికి ఆఫర్లు రావట్లేదని ఇండస్ట్రీలో తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'డమరుకం' సినిమా నాగార్జున కెరీర్‌లోనే ఒక బ్లాక్‌బస్టర్ అని, 'సోగ్గాడే చిన్ని నాయనా' వచ్చే వరకు రూ. 42 కోట్లు కలెక్ట్ చేసి నాగ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం సినిమా మూడుసార్లు వాయిదా పడటం వల్ల కొంత నెగెటివ్ టాక్ వచ్చిందే తప్ప, సినిమా పెద్ద హిట్ అని ఆయన తేల్చి చెప్పారు.
