శెట్టిబ్యూటీకి సక్సెస్ కలిసొచ్చిన వేళ!
`కేజీఎఫ్` తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి పెద్దగా అవకాశాలు రాని మాట వాస్తవం.
By: Srikanth Kontham | 22 Oct 2025 3:00 PM IST`కేజీఎఫ్` తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి పెద్దగా అవకాశాలు రాని మాట వాస్తవం. `కేజీఎఫ్` మొదటి భాగం రిలీజ్ అనంతరం మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ అనంతరం `కేజీఎఫ్ 2`, `కోబ్రా`లో నటించింది. ఆ తర్వాత మళ్లీ మరో అవకాశం రావడానికి ఏకంగా మూడేళ్లు సమయం పట్టింది. అదీ కన్నడలో కాదు. ఆ అవకాశం కూడా తెలుగులో వచ్చింది. అదే రీసెంట్ రిలీజ్ `హిట్ 3`. నాని హీరోగా నటించిన సినిమాలో శ్రీనిధి శెట్టి సరైన పాత్ర పోషించి బాగానే ఫేమస్ అయింది. సినిమా విజయం అమ్మడికి కలిసొచ్చింది. గ్లామర్ కు తావు లేకుండా డీసెంట్ రోల్ పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాను అందాలు ఎరగా వేసి నటించే దాన్ని కాదు..పెర్పార్మర్ మాత్రమేనని ప్రూవ్ చేసింది.
టాలీవుడ్ లో మంచి భవిష్యత్:
తనలో ఆ ట్యాలెంట్ నేడు కొత్త అవకాశాలకు దారి తీసింది. ఇటీవలే రిలీజ్ అయిన `తెలుసు కదా`లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాలో ఛాన్సు అందుకుందనే ప్రచారం జరిగింది. మొన్నటి వరకూ అది ప్రచారమే అయినా నేడు అదే నిజమైంది. సినిమాలో వెంకీకి జోడీగా శ్రీనిధి ఫైనల్ అయింది. ఈ నేపథ్యంలో శ్రీనిధి శెట్టికి ఇంకా మంచి భవిష్యత్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిభతో పాటు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం వంటి కొన్ని లక్షణాలు మిగతా బ్యూటీల నుంచి వేరు చేస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రం ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.
గ్లామర్ పాత్రలకు దూరంగా:
గ్లామర్ గేట్లు ఎత్తేస్తానంటే? అవకాశాలివ్వడానికి చాలా మంది సిద్దంగా ఉంటారు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా శ్రీనిధి వచ్చిన అవకాశాలతో సంతృప్తి చెందుతుంది. అందులో ది బెస్ట్ సెలక్ట్ చేసుకుంటుంది. అమ్మడు డిజైనర్ దుస్తులకు కూడా దూరంగా ఉంటుంది. సింపుల్ డిజైన్స్ లో ముస్తాబవుతుంది. అందాల ఆరబోతకు ఎంత మాత్రం ఛాన్స్ ఇవ్వదు. సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ పద్దతైన దుస్తులు ధరించి కనిపిస్తుంది. అవన్నీ శ్రీనిధికి తెలుగులో ఓ రకంగా కలిసొచ్చేవే అయినా? మరో రకంగా కొన్ని రకాల ఛాన్సులు కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఈ బ్యూటీ తీరు చూస్తుంటే?
ఆ బ్యూటీ జర్నీలా శ్రీనిధి:
సాయి పల్లవి విధానంలో కనిపిస్తోంది. సాయి పల్లవి ప్రయాణం ఎలా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే చేసు కుంటూ వచ్చింది. మధ్యలో పారితోషికం ఆఫర్లు ఎన్ని వచ్చినా? నో ఛాన్స్ అంటూ గీసుకున్న గీత దాట లేదు. తక్కువ పారితోషికం అయినా? నచ్చిన పాత్రలే చేస్తానంటూ ముందుకు సాగుతుంది. తనలో ఆ క్వాలిటీనే బాలీవుడ్ లో రామాయణం వరకూ దారి తీసింది. రామాయణంలో అమ్మడు సీత పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీనిధి శెట్టి ప్రయాణం కూడా అలాగే సాగుతుందా? అన్నది చూడాలి.
