Begin typing your search above and press return to search.

ఇది రెగ్యులర్ త్రివిక్రమ్ సినిమా కాదు.. ‘ఆదర్శ కుటుంబం’పై శ్రీనిధి కామెంట్స్!

ఈ సినిమా సాధారణంగా వచ్చే త్రివిక్రమ్ సినిమాలలా ఉండదని, ఇది ఒక విభిన్నమైన డార్క్ కామెడీ కథాంశంతో సాగుతుందని శ్రీనిధి శెట్టి వెల్లడించారు.

By:  Madhu Reddy   |   27 Oct 2026 9:00 PM IST
ఇది రెగ్యులర్ త్రివిక్రమ్ సినిమా కాదు.. ‘ఆదర్శ కుటుంబం’పై శ్రీనిధి కామెంట్స్!
X

విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా సినిమాలో కథానాయికగా నటించిన ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

త్రివిక్రమ్ మార్కుకు భిన్నమైన డార్క్ కామెడీ:

ఈ సినిమా సాధారణంగా వచ్చే త్రివిక్రమ్ సినిమాలలా ఉండదని, ఇది ఒక విభిన్నమైన డార్క్ కామెడీ కథాంశంతో సాగుతుందని శ్రీనిధి శెట్టి వెల్లడించారు. ‘కేజీఎఫ్’ విజయాల తర్వాత ‘కోబ్రా’తో ప్లాప్ చూశానని, ఒక సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది మన చేతుల్లో ఉండదని కెరీర్ ప్రారంభంలోనే గ్రహించినట్లు చెప్పారు. ఇక కంటెంట్ నచ్చి ఎంపిక చేసుకున్న చిత్రమే ఈ 'ఆదర్శ కుటుంబం' అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

గ్లామర్ లేని అమ్మ పాత్రలో శ్రీనిధి:

ఈ సినిమాలో తాను గ్లామర్ లేని ఒక తల్లి పాత్రను పోషిస్తున్నట్లు శ్రీనిధి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. కెరీర్ ప్రారంభంలోనే తల్లి పాత్ర అంటే వద్దనుకోలేదా అని అడగ్గా.. వెంకటేష్, త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్ అనగానే కాదనలేకపోయానని చెప్పారు. ఇక వెంకటేష్ గారి కామెడీ టైమింగ్, ఎమోషనల్ యాక్టింగ్‌ను మ్యాచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదని, కానీ డైరెక్టర్ సూచనలతో తన వంతుగా బెస్ట్ ఇచ్చానని చెప్పారు.

యాక్షన్ డోస్.. సొంతంగా డబ్బింగ్:

ఇక ‘హిట్ 3’ సినిమాలో కొద్దిగా యాక్షన్ చేసిన శ్రీనిధికి, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో కూడా కొంత యాక్షన్ సీన్స్ చేసే అవకాశం దక్కిందట. అంతేకాకుండా ఈ సినిమాకు ఆమె సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఈ ప్రాజెక్ట్ తన మనసుకు బాగా దగ్గరైందని శ్రీనిధి తెలిపారు.

'రామాయణ' ఆడిషన్స్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వరకు:

ఇతర సినిమాల గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ’లో సీత పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చినట్లు శ్రీనిధి వెల్లడించారు. అయితే ఆ పాత్రకు చివరికి సాయిపల్లవి ఎంపికయ్యారని తెలిపారు. ఇక ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్నానని, తెలుగులో మరికొన్ని కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇక మొత్తానికి చూస్తే, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’లో శ్రీనిధి శెట్టి ఒక గ్లామర్ లేని, యాక్షన్ స్కోప్ ఉన్న అమ్మ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఇక రెగ్యులర్ త్రివిక్రమ్ శైలికి భిన్నంగా డార్క్ కామెడీతో వస్తున్న ఈ సినిమా ఈ నెల 30న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.