Begin typing your search above and press return to search.

హీరో ప్రాధాన్యత ఉన్న చోట హీరోయిన్లు వెనుకబడతారు!

సిద్ధార్థ్ కన్నన్‌తో జరిపిన ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. `చిత్ర పరిశ్రమలో కథానాయకుడి ప్రాధాన్యతను బట్టి ఇతర పాత్రల తీరుతెన్నులు మారుతాయన్నారు .

By:  Srikanth Kontham   |   10 Oct 2026 2:00 PM IST
హీరో ప్రాధాన్యత ఉన్న చోట హీరోయిన్లు వెనుకబడతారు!
X

`కేజీఎఫ్` సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక శ్రీనిధి శెట్టి. ఈ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీతో ప్రజాదరణ పొందినా? దక్షిణాది చిత్రసీమలో మహిళా పాత్రల చిత్రీకరణ , ప్రాధాన్యతపై అమ్మ‌డు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కథానాయకుడి చుట్టూ తిరిగే సినిమాల్లో నాయికల పాత్రల స్థాయి ఏ విధంగా ఉంటుందో శ్రీనిధి ఎంతో స్పష్టంగా విశ్లేషించారు.

సిద్ధార్థ్ కన్నన్‌తో జరిపిన ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. `చిత్ర పరిశ్రమలో కథానాయకుడి ప్రాధాన్యతను బట్టి ఇతర పాత్రల తీరుతెన్నులు మారుతాయన్నారు . సినిమాలో హీరో కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు కథలో ఇతర నటీనటులందరూ కేవలం ఆ హీరో పాత్రకు అనుబంధంగా మాత్రమే మారిపోతారు. హీరో చుట్టూ కథ తిరిగేటప్పుడు నాయికల పాత్రలు సహజంగానే వెనుకబడిపోతాయన్నారు.

అయితే ప్రతీ సినిమాలోనూ ఇదే పరిస్థితి ఉండదని కూడా వెల్ల‌డించారు. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల‌కే పూర్తి ప్రాధాన్యం ఇచ్చే కథాంశాలు, సినిమాలు కూడా వస్తున్నాయని అది పూర్తిగా ఎంచుకునే కథ , దర్శకుడి ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. హీరో సెంట్రిక్ సినిమాల్లో పరిమితులు ఉన్నా? మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటీనటులకు ప్రతిభను చాటుకునే పూర్తి అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే `కేజీఎఫ్` డ్రామాలో తాను పోషించిన రీనా దేశాయ్ పాత్ర గురించి విశ్లేషించింది. అంతటి కథానాయక ప్రాధాన్యం ఉన్న సినిమాలో తన పరిమితులు తనకు తెలుసని పేర్కొన్నారు. అలాంటి బిగ్ క్యాన్వాస్ చిత్రాల్లో హీరో మాసిజం, యాక్షన్ సీన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అయితే ఆయా కథలకు అలాంటి సమతుల్యత అవ సరమని అభిప్రాయపడ్డారు. స్క్రీన్ టైమ్ .. పాత్ర నిడివి కంటే అంత పెద్ద సినిమాలో భాగమవ్వడం , ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేయడమే ఒక నటిగా ముఖ్యమన్నారు.

ప్రస్తుత చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులను కూడా శ్రీనిధి సానుకూలంగా స్వాగతించారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన కథానాయికలు ఇప్పుడు కథను తమ భుజస్కంధాలపై నడిపించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. పరిశ్రమలో స్టార్ డమ్ ఉన్న నటీమణులు సైతం డి-గ్లామర్ వేషధారణలతో పాటు, నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇది చిత్రసీమలో మహిళా ప్రాధాన్యతకు శుభసూచకమన్నారు.

అంతిమంగా ఒక నటిగా అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించడమే ప్రధాన లక్ష్యమని శ్రీనిధి శెట్టి స్పష్టం చేశారు. కమర్షియల్ హంగులతో కూడిన హీరో సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూనే నటనకు స్కోప్ ఉండే ఫిమేల్ సెంట్రిక్ చిత్రాల్లోనూ భాగస్వామి కావాలన్నారు. సినిమా ఏదైనా ? ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయే మంచి కథలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే పరిశ్రమలో నటీనటుల భవిష్యత్తు ఎప్పుడూ ఉజ్జ్వలంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.