Begin typing your search above and press return to search.

కుటుంబ చిత్రంతోనైనా శ్రీనిధి కెరీర్ ట‌ర్న్ అవుతుందా!

భారీ హిట్లు ఖాతాలో ఉన్నా? అవకాశాల విషయంలో మాత్రం స్పీడ్ పెంచలేకపోయిన శ్రీనిధి కెరీర్‌కు ఇప్పుడు ఓ కీలకమైన పరీక్ష ఎదురవుతోంది.

By:  Srikanth Kontham   |   2 Oct 2026 8:00 PM IST
కుటుంబ చిత్రంతోనైనా శ్రీనిధి కెరీర్ ట‌ర్న్ అవుతుందా!
X

కన్నడ సౌందర్యరాశి శ్రీనిధి శెట్టి కెరీర్ తొలి నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన `కేజీఎఫ్` ఫ్రాంచైజీతో వెండితెరకు పరిచయమైన అమ్మ‌డు తొలి చిత్రంతోనే వెయ్యి కోట్ల క్లబ్ హీరోయిన్‌గా నిలిచారు. అటుపై విక్రమ్ సరసన `కోబ్రా`, నేచురల్ స్టార్ నానితో `హిట్-3` వంటి విజయవంతమైన చిత్రాల్లో న‌టించినా? ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయారు. భారీ హిట్లు ఖాతాలో ఉన్నా? అవకాశాల విషయంలో మాత్రం స్పీడ్ పెంచలేకపోయిన శ్రీనిధి కెరీర్‌కు ఇప్పుడు ఓ కీలకమైన పరీక్ష ఎదురవుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `ఆదర్శ కుటుంబం` చిత్రంపై శ్రీనిధి భారీ ఆశలే పెట్టుకున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అమ్మ‌డు వెంకటేష్ సరసన 'స్వర్ణ' అనే గృహిణిగా, తల్లి పాత్రలో క‌నిపిస్తుంది. గ్లామరస్ రోల్స్ .. పాటలకే పరిమితమయ్యే క్యారెక్టర్లకు భిన్నంగా మధ్యతరగతి కుటుంబంలోని భార్యగా, బాధ్యతాయుతమైన తల్లిగా అమ్మ‌డు ఈ చిత్రంలో డీగ్లామరైజ్డ్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ పోషిస్తున్నారు.

గ్లామర్ బ్యూటీగా గుర్తించబడిన శ్రీనిధి శెట్టికి ఈ తరహా పాత్ర ఒక రకంగా సరికొత్త సవాలు అనే చెప్పాలి. గ్లామర్ డాల్ అనే ఇమేజ్‌కే పరిమితం కాకుండా నటిగా తనలో పరిణతిని, నటనలోని వైవిధ్యాన్ని నిరూపించుకోవడానికి `ఆదర్శ కుటుంబం` మంచి అవకాశంగా మారింది. కమర్షియల్ హంగులతో పాటు కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉండే సినిమాలో శ్రీనిధి పోషించిన పాత్ర ద్వారా తన ఐడెంటిటీని దాటి నటిగా మరో మెట్టు పైకెక్కే అవకాశం ఉంది.

దర్శకుడు త్రివిక్రమ్ స్ సినిమాల్లో కథానాయికల పాత్రలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత .. బలమైన గుర్తింపు ఉంటాయి. హీరోయిన్లను అందాల ఆరబోతకే పరిమితం చేయకుండా గుర్తుండిపోయే నటనను రాబట్టుకోవడం త్రివిక్రమ్ శైలి. ఈ నేపథ్యంలో `ఆదర్శ కుటుంబం`లో శ్రీనిధి పాత్రను కూడా ఆయన పకడ్బందీగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఈ చిత్రం కనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే టాలీవుడ్‌లో శ్రీనిధికి పర్ఫార్మెన్స్ లేడీగా సరికొత్త తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు పెద్ద ప్రాజెక్టులు, భారీ బడ్జెట్ సినిమాలపైనే దృష్టి పెట్టిన శ్రీనిధి శెట్టి ఈ సినిమాతో నటిగా అన్ని రకాల పాత్రలకూ తాను సిద్ధమేననే సంకేతాలను ఇండస్ట్రీకి ఇస్తున్నారు. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా హోమ్లీ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్లను కూడా సమర్థవంతంగా చేయగలనని రుజువు చేసుకుంటే? సౌత్ ఇండస్ట్రీలో అమ్మ‌డుకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్ -మిడ్-రేంజ్ హీరోల చిత్రాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయ‌ని గెస్ చేస్తున్నారంతా.