Begin typing your search above and press return to search.

రెండో సినిమా దగ్గరే తడబడుతున్న దర్శకులు

కానీ ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్‌తో చేసిన పెద్ది మాత్రం ఆ అంచనాలకు తగ్గ రిజల్ట్ ఇవ్వలేకపోయింది.

By:  M Prashanth   |   14 Sept 2026 11:49 AM IST
రెండో సినిమా దగ్గరే తడబడుతున్న దర్శకులు
X

ఫస్ట్ సినిమాతోనే పేరు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, రెండో సినిమాతో ఆ పేరును నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. టాలీవుడ్‌లో ఈ మధ్య ఆ రెండో సినిమా కొంతమంది దర్శకులకు ఇబ్బంది పెట్టింది. ఉప్పెనతో బుచ్చిబాబు సానా భారీ హిట్ అందుకున్నారు. కానీ ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్‌తో చేసిన పెద్ది మాత్రం ఆ అంచనాలకు తగ్గ రిజల్ట్ ఇవ్వలేకపోయింది. భారీ బడ్జెట్, పెద్ద స్టార్, పాన్ ఇండియా రిలీజ్ ఉన్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో నిలబడలేదు.

ఈ తరహాలో ఈమధ్య తడబడ్డ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. ఆర్ఎక్స్ 100తో అజయ్ భూపతి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. రెండో సినిమా మహాసముద్రం మాత్రం ఫ్లాప్ అయింది. అ!తో ప్రశాంత్ వర్మకు మంచి గుర్తింపు వస్తే, రెండో సినిమా కల్కి అదే స్థాయిలో వర్కవుట్ కాలేదు. నీది నాది ఒకే కథతో వేణు ఊడుగుల పేరు తెచ్చుకున్నా, రెండో సినిమా విరాటపర్వం థియేటర్లలో కమర్షియల్ రిజల్ట్ అందుకోలేకపోయింది.

ఆదిత్య హాసన్ లెక్క కాస్త వేరు. 90స్ వెబ్ సిరీస్ అయినా, ఆయనకు వచ్చిన గుర్తింపు మాత్రం ఒక హిట్ సినిమా దర్శకుడి రేంజ్‌లోనే ఉంది. అందుకే ఎపిక్ ఆయనకు మొదటి బిగ్ స్క్రీన్ సినిమా అయినా, ప్రేక్షకుల దృష్టిలో మాత్రం రెండో పెద్ద పరీక్షే. 90స్ తర్వాత అంచనాలు పెరిగాయి. ఎపిక్‌కు ఇప్పుడు మిక్స్డ్ టాక్ రావడం, మొదటి వీకెండ్ కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ రెండో స్టెప్ ఎంత కష్టమో మరోసారి కనిపించింది.

ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. దసరాతో తొలి సినిమాకే నానిని కొత్తగా చూపించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్, రా ట్రీట్‌మెంట్, క్లైమాక్స్ యాక్షన్ ఆ సినిమాకు గుర్తింపు తెచ్చాయి. అదే కాంబినేషన్ ఇప్పుడు ది ప్యారడైజ్‌తో తిరిగి వస్తోంది. హీరో కూడా నానినే అయినా, ఈసారి సినిమా రేంజ్ మాత్రం దసరా కంటే పెద్దది.

ది ప్యారడైజ్ కోసం నాని లుక్ నుంచి వరల్డ్ వరకు అన్నీ మార్చేశారు. 1980ల సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్, జడల్ క్యారెక్టర్, భారీ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్‌తో సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ ఇప్పటికే రెండుసార్లు మారింది. చివరి దశ పనులు రిలీజ్‌కు దగ్గర వరకు వెళ్లడంతో ట్రైలర్ కూడా విడుదల చేయకుండా డైరెక్ట్ గా సినిమాతోనే రావాలని టీమ్ నిర్ణయించింది.

బుచ్చిబాబుకు రెండో సినిమాకే రామ్ చరణ్ దొరికినట్లే, శ్రీకాంత్ ఓదెలకు కూడా తొలి హిట్ తర్వాత వెంటనే పెద్ద కాన్వాస్ దొరికింది. తేడా ఏంటంటే ఆయన హీరోను మార్చలేదు. మొదటి సినిమాతో వచ్చిన పేరు రెండో సినిమాతో ఇంకా పెరుగుతుందా, లేక ఈ మధ్య కనిపిస్తున్న సెకండ్ ఫిల్మ్ తడబాటు శ్రీకాంత్ దగ్గర కూడా రిపీట్ అవుతుందా అన్నది చూడాలి.