మోహన్ బాబు గారితో పని చేయడం లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్: శ్రీకాంత్ ఓదెల
టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలతో ఆకర్షిస్తున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన ప్రతిభతో పాటు విలక్షణమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
By: Sivaji Kontham | 27 Sept 2026 9:30 AM ISTటాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలతో ఆకర్షిస్తున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన ప్రతిభతో పాటు విలక్షణమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల జరిగిన `ది ప్యారడైస్` విజయోత్సవ వేదికపై ఆయన ప్రసంగం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సక్సెస్ మీట్‌లో సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌ను, నటుడిని పేరుపేరునా అభినందించిన శ్రీకాంత్ ఓదెల.. ముఖ్యంగా లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబుతో తన అనుబంధం గురించి మాట్లాడిన విశేషాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో మోహన్ బాబు నటన గురించి ప్రస్తావిస్తూ.. లెజెండరీ నటుడితో పనిచేయడం తన జీవితంలోనే ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని శ్రీకాంత్ భావోద్వేగంతో తెలిపారు. అయితే మోహన్ బాబుతో సినిమా చేయకముందు తాను బయట ఎన్నో రకాల రూమర్స్ విన్నట్లు పేర్కొన్నారు. కొందరు ఆయనను ఒక `హిట్లర్` లాంటి కఠినమైన వ్యక్తి అని.. సెట్లో ఆయనతో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టమని హెచ్చరించినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. ఎవరూ చెప్పిన మాటలు వినరని.. తనకంటూ ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారని చాలామంది భయపెట్టినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.
కానీ తాను తిరుపతిలో మోహన్ బాబును కలిసిన మొదటి సమావేశంలోనే ఆ అపోహలన్నీ పటాపంచలయ్యాయని శ్రీకాంత్ స్పష్టం చేశారు. బయట వినిపించిన దానికి.. వాస్తవానికి చాలా తేడా ఉందని తెలిపారు. సెట్లో మోహన్ బాబు వ్యవహారశైలి చూసి తాను, తన టీమ్ సభ్యులు ఎంతో ఆశ్చర్యపోయామని చెప్పారు. సీనియర్ నటుడైనా.. సెట్లో ఆయన ఒక చిన్నపిల్లవాడిలా ఉత్సాహంగా.. అమాయకంగా ఉండేవారని.. తనతో గ్యాప్ అనేది లేకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారని కొనియాడారు.
దర్శకుడిగా తాను చెప్పాలనుకున్నది మోహన్ బాబుకు ఎంతో స్పష్టంగా చెప్పగలిగానని.. ఆయన కూడా దాన్ని అర్థం చేసుకుని పూర్తి సహకారం అందించారని శ్రీకాంత్ తెలిపారు. మోహన్ బాబుతో పనిచేసిన ఆ అనుభవం ద్వారా తాను వ్యక్తిగతంగా చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా ఉండటంలో ఆయన నుంచి ఎంతో స్పూర్తి పొందానని.. తనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ అనుభవం ఎంతగానో దోహదపడిందని ప్రశంసించారు.
మొత్తంగా చూస్తే.. సీనియర్ నటులతో పని అనుభవం.. యువ దర్శకుల ఆలోచనల కలయిక ఏ విధంగా తెరపై వర్కవుట్ అవుతుందో శ్రీకాంత్ ఓదెల - మోహన్ బాబుల కాంబినేషన్ నిరూపించింది. బయట ఉండే అపోహలను పక్కనపెట్టి ఒక లెజెండరీ నటుడి నుంచి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టడంలో శ్రీకాంత్ చూపిన చొరవ ప్రశంసనీయం. ఈ ప్రసంగం ద్వారా మోహన్ బాబులోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. చిత్ర పరిశ్రమలో పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో శ్రీకాంత్ మరోసారి చాటిచెప్పారు. ది ప్యారడైజ్ చిత్రానికి ఆరంభం మిశ్రమ స్పందనలు వచ్చనా, డే1 భారీ ఓపెనింగులను సాధించిన సంగతి తెలిసిందే.
