శ్రీకాంత్ ఓదెల లైఫ్‌లో ఫుల్ సర్కిల్ మూమెంట్!
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2026 10:00 PM ISTసినీ ఇండస్ట్రీలో కొన్ని ప్రదేశాలు కేవలం షూటింగ్ లొకేషన్స్‌గానో, ఆఫీసులుగానో ఉండవు. అక్కడ మొదలైన ప్రయాణం తర్వాతి దశలో ఎక్కడికి తీసుకెళ్తుందో గుర్తు చేసే జ్ఞాపకాలుగా మారిపోతాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒకప్పుడు అదే ఆఫీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూర్చుని సినిమాను నేర్చుకున్న ఆయన.. ఇప్పుడదే గదిలో డైరెక్టర్ గా కూర్చోవడం తన లైఫ్ లో మర్చిపోలేని ఫుల్ సర్కిల్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ సినిమాను తెరకెక్కిస్తున్న శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రంగస్థలం సినిమాకు పనిచేసిన టైమ్ లో సుకుమార్ కూర్చునే అదే ఆఫీస్, అదే రూమ్ ఆయనకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకాలను మిగిల్చింది. తాజాగా రాఘవ్ జుయల్‌తో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూలో ఆ ఆఫీస్‌ను చూపిస్తూ శ్రీకాంత్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది సినిమా ఆఫీస్. తనకు ఇక్కడ ఒక మెమొరబుల్ మెమరీ ఉంది. ఒకప్పుడు ఇదే రూమ్‌లో సుకుమార్ సర్ కూర్చునేవారు. ఇప్పుడు తాను కూడా అదే రూమ్‌లో కూర్చుంటున్నానంటూ తన జర్నీలోని ఆసక్తికరమైన మలుపును వివరించారు.
అయితే ఈ మార్పు అంత సులభంగా జరగలేదని శ్రీకాంత్ మాటల్లోనే తెలుస్తోంది. డైరెక్టర్ గా తనకంటూ ఒక రూమ్ వచ్చిన తొలి రోజుల్లో అక్కడ కూర్చోవాలా వద్దా అనే ఆలోచన కూడా వచ్చేదని చెప్పారు. ఆ ప్లేస్ తో తనకు అప్పటికే ఒక గౌరవం, భయం, అనుబంధం ఉండటంతో మొదట్లో మిక్స్‌డ్ ఫీలింగ్స్ ఉండేవని, క్రమంగా ఆ వాతావరణానికి అలవాటు పడ్డానని తెలిపారు. ఒకప్పుడు తాను డైరెక్టర్ వెనుక నిలబడి సినిమా నేర్చుకున్న అదే స్థానం.. ఇప్పుడు తానే డెసిషన్స్ తీసుకునే స్థాయిగా మారడం శ్రీకాంత్ కెరీర్‌లో ఎంతటి మార్పు వచ్చిందో చెప్పకనే చెబుతోంది.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. నానితో దసరా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తనదైన మాస్ టేకింగ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఆయన.. ఇప్పుడు అదే నానితో ది ప్యారడైజ్ కోసం మరింత భారీ స్థాయిలో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ క్రమంలో బయటపడిన ఈ మెమొరీ.. శ్రీకాంత్ కెరీర్‌లో వచ్చిన మార్పును మాత్రమే కాదు, ఒకప్పుడు కలగా కనిపించిన స్థానం ఇప్పుడు తన జర్నీలో భాగమైన విధానాన్ని కూడా చూపిస్తోంది. అందుకే ఆయన చెప్పిన ఈ కథలో ఫుల్ సర్కిల్ అనే మాట మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.
