మాస్ సంచలనం వాట్ నెక్స్ట్ ?
‘ది ప్యారడైజ్’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. చిరంజీవితో ప్రకటించిన ప్రాజెక్ట్ తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. ఈసారి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యం లేదా తెలంగాణ గ్రామీణ వాతావరణంలో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ యంగ్ హీరో నటించే అవకాశం ఉందని టాక్.
By: Srikanth Kontham | 25 Nov 2026 10:09 AM ISTతొలి చిత్రం `దసరా`తో బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ సంచలనం సృష్టించిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అటుపై నానితోనే కలిసి తెరకెక్కించిన `ది ప్యారడైజ్` తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన రావడంతో శ్రీకాంత్ తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందనే ఆసక్తి నెలకొంది. వరుసగా రెండు భారీ యాక్షన్ చిత్రాల తర్వాత మాస్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో? ఏ జానర్లో చేయబోతున్నారనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
నిజానికి `ది ప్యారడైజ్` కంటే ముందే మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాని సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో తొలి నుంచీ భారీ అంచనాలున్నాయి. చిరంజీవిని ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త రస్టిక్ మాస్ షేడ్‌లో చూపించడానికి శ్రీకాంత్ పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని ప్రచారం జరిగింది.
అయితే ప్యారడైజ్ ఫలితం తో అంతా తారుమారైంది. తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ను పక్కనబెట్టారు. దీంతో ఓ సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని కొత్త వార్త తెరపైకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యం లేదా తెలంగాణ గ్రామీణ వాతావరణం చుట్టూ తిరిగే ఓఎమోషనల్ లవ్ స్టోరీపై శ్రీకాంత్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గత చిత్రంలో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుని మరింత బలమైన కథతో తిరిగి రావాలనేదే ఉద్దేశంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం కొత్త కథలకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ముందుగా ప్రేమకథనే పట్టా లెక్కిస్తే అందులో హీరోగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోతో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టార్ హీరోతో ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. చిరంజీవి వెనక్కి తగ్గడం మినహా సీనియర్లు అంతా ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉన్నారు.
ఇంత బిజీలో శ్రీకాంత్ కు డేట్లు ఇవ్వడం అంటే అంత వీజీ కాదు. అలాగే కథ విషయంలోనూ శ్రీకాంత్ ఈసారి మరింత ఇన్నోవేటివ్ గా థింక్ చేయాల్సిందే. `దసరా` ఛాయలు ప్యారడైజ్ లోనూ కనిపించాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తదుపరి ప్రాజెక్ట్ ఏదైనా? ఆ జానర్ ప్లేవర్ నుంచి పూర్తిగా బయటకొచ్చి పని చేయాల్సిందే.
