Begin typing your search above and press return to search.

సుకుమార్ శిష్యుడి గతం.. మెగా పవర్ స్టార్ ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్

`దసరా` చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మాస్ ప్రేక్షకులను ఊపేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌.

By:  Srikanth Kontham   |   15 Sept 2026 1:02 PM IST
సుకుమార్ శిష్యుడి గతం.. మెగా పవర్ స్టార్ ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్
X

`దసరా` చిత్రంతో మొదటి ప్రయత్నంలోనే మాస్ ప్రేక్షకులను ఊపేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌. ప్ర‌స్తుతం అత‌డు తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం `ది ప్యారడైజ్` ప్రమోషన్ల పర్వంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ పంచుకున్న ఓ పర్సనల్ ఎమోషనల్ జ్ఞాపకం నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు సుకుమార్ వద్ద `రంగస్థలం` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తనకు ఎదురైన ప్రత్యేక అనుభవాన్ని శ్రీకాంత్ ఇటీవల వెల్లడించారు.

నటుడు రాఘవ్ జుయల్ ఆయన మెడలోని ఒక రుద్రాక్ష లాకెట్ గురించి ప్రశ్నించగా దాని వెనుక ఉన్న ఆసక్తికర కథను వివరిస్తూ అరుదైన జ్ఞాపకాన్ని బయటపెట్టారు. `రంగస్థలం` షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్స్, తెల్లవారు జాము షూటింగ్‌ల విషయంలో పర్ఫెక్షన్ కోసం రామ్ చరణ్ టీమ్‌ను తాను చాలా ఇబ్బంది పెట్టేవాడినని శ్రీకాంత్ తెలిపారు. చరణ్ లుక్ , కాస్ట్యూమ్స్ సరిగ్గా రావడానికి తాను పడ్డ ఆరాటాన్ని సరదాగా హింసించడం అని సంబోధించారు. అయితే షూటింగ్ చివరి రోజుల్లో ఊహించని రీతిలో చరణ్ కారవాన్ నుంచి శ్రీకాంత్‌కు పిలుపు వచ్చింది.

సాధారణంగా ఎవరినీ సెట్స్‌లో కారవాన్‌కు పిలవని రామ్ చరణ్ తనను లోపలికి పిలవడంతో శ్రీకాంత్ ఆశ్చర్యపోయారట. చరణ్ తనను చూడగానే `రంగస్థలం` సినిమాలో తాను ధరించిన లాకెట్లలో ఒకటైన ప్రత్యేకమైన రుద్రాక్ష లాకెట్‌ను తీసి శ్రీకాంత్ చేతిలో పెట్టి భద్రంగా ఉంచుకోమని చెప్పారు. అది సాధారణమైనది కాదని, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించిన రెండు లాకెట్లలో అదొకటని శ్రీకాంత్ వివరించారు.

అంతటి అరుదైన..పవిత్రమైన బహుమతిని చరణ్ తనకివ్వడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని, ఇప్పటివరకు దాన్ని మెడలోంచి తీయలేదన్నారు. ఇటీవల చరణ్‌ను కలిసినప్పుడు ఈ విషయం గుర్తుచేస్తే ఆయన దాని గురించి మరచిపోయినట్లుగా అనిపించిందని శ్రీకాంత్ వెల్లడించారు.

ప్ర‌స్తుతం శ్రీకాంత్ ఓదెల `ది ప్యారడైజ్` సినిమా పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. `దసరా` వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని-శ్రీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడం తో ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. ఈ చిత్రంలో రాఘవ్ జుయల్ విలన్‌గా న‌టిస్తుండ‌గా.. కాయాదు లోహర్ కథానాయికగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. యువ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంట‌నే శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవితో తెర‌కెక్కించాల్సిన ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీ అవుతారు. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.