Begin typing your search above and press return to search.

తెలంగాణను వదలని శ్రీకాంత్ ఓదెల.. ఈసారి లవ్ స్టోరీతో!

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉందని సమాచారం. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Oct 2026 10:11 PM IST
తెలంగాణను వదలని శ్రీకాంత్ ఓదెల.. ఈసారి లవ్ స్టోరీతో!
X

తెలంగాణ నేపథ్యం, పల్లెటూరి వాతావరణం, సహజమైన యాసతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తన మొదటి సినిమా దసరాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మరోసారి తెలంగాణ నేపథ్యంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈసారి మాస్ యాక్షన్ కథ కాకుండా ప్రేమకథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తెలంగాణ గ్రామీణ జీవితం, అక్కడి ప్రజల మాటతీరు, వారి జీవనశైలి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ యాసను సహజంగా చూపించడంలో శ్రీకాంత్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఆ తర్వాత నాని హీరోగా ది ప్యారడైజ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో కూడా తెలంగాణ నేపథ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, శ్రీకాంత్ ఓదెల తన తదుపరి సినిమా కోసం మరోసారి తెలంగాణ నేపథ్యాన్నే ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అందుతున్న సినీవర్గాల సమాచారం ప్రకారం, శ్రీకాంత్ ఓదెల తన తర్వాతి సినిమా కోసం ఒక కొత్త కథను సిద్ధం చేస్తున్నారట. 2014 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సాగే గాఢమైన ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకు ఆయన సినిమాల్లో మాస్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు, గ్రామీణ వాతావరణం ఎక్కువగా కనిపించాయి. అయితే ఈసారి ప్రేమకథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమం సమయంలోని పరిస్థితులు, ఆ కాలంలో ప్రేమికులు ఎదుర్కొన్న సమస్యలు ఈ కథలో భాగమవుతాయా అనే ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉందని సమాచారం. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.

మరోవైపు, మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఒక సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ సినిమాను నాని నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు కొత్త అప్‌డేట్ రాలేదు. దీంతో ముందుగా ప్రేమకథను తెరకెక్కిస్తారా? లేక చిరంజీవి సినిమాను మొదలుపెడతారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా శ్రీకాంత్ ఓదెల తన సినిమాల్లో తెలంగాణ నేపథ్యానికి ప్రత్యేక స్థానం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా అందరూ దర్శకులు అన్ని ప్రాంతాల వాళ్లను టచ్ చేసేలాగా తమ ఒక్కొక్క సినిమాలో ఒక్కో ప్రాంతీయ భావాన్ని లేకపోతే భాషను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ శ్రీకాంత్ మాత్రం తెలంగాణ యాసకు అలాగే తెలంగాణ ప్రాంతానికి ఫిక్స్ అయిపోయి సినిమాలు తీస్తున్నట్టు కనిపిస్తున్నారు.