సచిన్ టెండూల్కర్ టీమ్ కెప్టెన్ నాగార్జున ఫ్రెండు!
పాత రోజులను, పాత స్నేహాలను, పాత సంగతులను గుర్తు చేసుకుంటే, ఎన్నో జ్ఞాపకాలు దొంతరులుగా కళ్ల ముందు నుంచి కదిలి వెళతాయి.
By: Tupaki | 5 Nov 2025 10:01 PM ISTపాత రోజులను, పాత స్నేహాలను, పాత సంగతులను గుర్తు చేసుకుంటే, ఎన్నో జ్ఞాపకాలు దొంతరులుగా కళ్ల ముందు నుంచి కదిలి వెళతాయి. అలాంటి జ్ఞాపకాల దొంతరల్లోంచి కొన్నిటిని మనకోసం చెప్పాడు కింగ్ నాగార్జున చిన్నప్పటి ఫ్రెండు కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనొద్దు. లెజెండరీ కపిల్ దేవ్ సారథ్యంలోని 1983 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా లో కీలక సభ్యుడు. శ్రీకాంత్ దూకుడున్న బ్యాట్స్ మన్. అతడు తమిళనాడు కి చెందిన వాడు.
అతడు ఇప్పుడు కల్ట్ క్లాసిక్ `శివ` సినిమా గురించి, నాగార్జునతో తన స్నేహం గురించి చెప్పిన విషయాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నాగార్జున, శ్రీకాంత్ ఇద్దరూ చెన్నైలో ఇంజినీరింగ్ చదువుకునే రోజుల్లో మంచి స్నేహితులు. నాగ్ క్లాస్ లో చాలా కామ్‌గా ఉండేవాడు. కానీ అలాంటి వాడు ఉన్నట్టుండి శివ సినిమాతో యాక్షన్ హీరో అయిపోగానే అందరం ఆశ్చర్యపోయామని శ్రీకాంత్ కృష్ణమాచారి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
అయితే శ్రీకాంత్- నాగార్జున ఇంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం ఇన్నాళ్లు ఎవరికీ అంతగా తెలియదు. దీనికి కారణం ఆ ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా దీనిని చర్చించకపోవడమే. ఇరు రంగాల్లో దిగ్గజాలు ఇంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలియగానే అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ పెరిగింది.
శ్రీకాంత్ కృష్ణమాచారి తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన 90లలో టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడే సచిన్ టెండూల్కర్ కూడా క్రికెటర్ గా ఆరంగేట్రం చేసారు. శ్రీకాంత్- గవాస్కర్ జోడీ ఓపెనింగ్ బ్యాట్స్ మన్లుగా బరిలో దిగేవారు. ప్రస్తుతం ఆయన క్రికెట్ కామెంటేటర్ గాను పని చేస్తున్నారు.
