Begin typing your search above and press return to search.

తోలు తీసిన పోలీస్.. శ్రీకాళహస్తి ఘటనపై వెనువెంటనే రియాక్షన్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ పై రెచ్చిబోయిన ఇద్దరు యువకులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ వైరల్ అవుతోంది.

By:  Tupaki Political Desk   |   13 Aug 2026 2:09 PM IST
తోలు తీసిన పోలీస్.. శ్రీకాళహస్తి ఘటనపై వెనువెంటనే రియాక్షన్
X

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ పై రెచ్చిబోయిన ఇద్దరు యువకులకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ పై నడిరోడ్డుపై ఇద్దరు యవకులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. పోలీసులకే రక్షణ లేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అయితే ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించిన యువకుల చేతికి సంకెళ్లు వేసి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లిన వీడియో బయటకు వచ్చింది. దీంతో యాక్షన్ కు రియాక్షన్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి పట్టణంలో ఇద్దరు యువకులు గొడవ చేస్తుండగా, హెడ్ కానిస్టేబుల్ రమణయ్య వారించడానికి ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువకులు హెడ్ కానిస్టేబుల్ పై తిరగబడ్డారు. చుట్టుపక్కల ఉన్నవారు వారిస్తున్నప్పటికీ హెడ్ కానిస్టుబుల్ కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించారని అంటున్నారు. అంతేకాకుండా ఓ యువకుడు కత్తితో బెదిరించడంతో హెడ్ కానిస్టేబుల్ తోపాటు అక్కడ ఉన్నవారు బెదిరిపోయారు. కాసేపు హెడ్ కానిస్టేబుల్ తో గొడవ పడిన యువకులు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోగా, ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడికి యత్నించడం, నడిరోడ్డుపై కాలర్ పట్టుకుని యువకుల హంగామా చేసిన తర్వాత సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత దాడికి యత్నించిన యువకుల ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. కొద్దిసేపట్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు తమ స్టైల్ లో బుద్ధి చెప్పారని అంటున్నారు. ఇద్దరు యవకులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లడమే కాకుండా, వారి చేతిని గొలుసులతో కట్టేశారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. పోలీసులపై తిరగబడిన యువకులకు ఆ మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఘటన రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగంపై చర్చకు దారితీసినట్లు చెబుతున్నారు. నిందితులు డగ్స్ లేదా గంజాయి సేవించడం వల్లే పోలీసులపై ఆ స్థాయిలో తిరగబడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటన తర్వాత పోలీసులు గంజాయి రవాణాపై మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని కోరుతున్నారు.