శ్రీహరి ఇంట డైరెక్టర్ మాట ఫలించిన వేళ!
రియల్ స్టార్ శ్రీహరి చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగారు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇంతింతై వటుడింతైన చందంగా ఎదిగారు.
By: Srikanth Kontham | 12 Nov 2025 12:00 PM ISTరియల్ స్టార్ శ్రీహరి చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగారు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇంతింతై వటుడింతైన చందంగా ఎదిగారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరో వరకూ అయ్యారు. హీరోగా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతోనూ ప్రేక్షకుల్ని అలరించారు. ఇమేజ్ అనే చట్రంలో ఇరుకోకుండా చిత్ర పరిశ్రమలో శ్రీహరి ప్రయాణం సాగింది. నటనలో తనదైన ప్రత్యేకత...యాస భాషలో తనకంటూ ఓ స్టైల్ ఉందని నిరూపించిన నటుడు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడిగా నిరూపించుకున్నారు.
బంగ్లా కొనగలనా? అన్నారు!
శ్రీహరి స్థానం చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ సుస్థిరమైనదే. మరో నటుడితో ఆ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. శ్రీహరికి దర్శకుడు చంద్ర మహేష్ మంచి స్నేహితుడని చెబుతారు. శ్రీహరి ఆయనతో కొన్ని సినిమాలు కూడా చేసారు. వాటిలో `అయోధ్య రామయ్య` మాత్రం పెద్దహిట్ అయింది. ఆ సినిమా శ్రీహరికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా అనుభవాలను చంద్ర మహేష్ పంచుకున్నారు. `ఓ సారి పెద్ద బంగ్లాలో షూటింగ్ జరుగుతుంటే? అక్కడకు శ్రీహరి కోసం వెళ్లాను. ఆ బంగ్లా శ్రీహరికి ఎంతో బాగా నచ్చింది.
నిర్మాతగా మంచి లాభాలు రావడంతోనే:
చాలా బాగుందని... అలాంటి బంగ్లా తాను కొనగలనా? లేదా? అని శ్రీహరి నాతో అన్నారు. అప్పుడు నేను `కాలం కలిసొస్తే ఆ బంగ్లా మీరే కొంటారు చూడండని` అన్నాను. ఆ తర్వాత కొంత కాలానికి ఇద్దరి కాంబినేషన్ లో `అయోధ్య రామయ్య` తెరకెక్కింది. ఆ సినిమాకు నిర్మాత శ్రీహరి కావడంతో రిలీజ్ అనంతరం మంచి లాభాలొచ్చాయి. ఆ డబ్బుతోనే ఆ బంగ్లాను కొన్నారు. అలా నా నోటి మాట నిజమవ్వడంతో? శ్రీహరి ఎంతో సంతోషంగా ఉండేవారన్నారు. అలాగే శ్రీహరి వ్యక్తిత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఎన్నో దానాలు చేసినా కొన్నే బయటకు:
దానాలు చేయడంలో కర్ణుడి సమానుడే. సహాయం అంటూ ఆయన ఇంటి గడప తొక్కితే అందని సహాయం ఉండదు. గొప్ప మానవతా వాధిగా శ్రీరికి పేరుంది. తెలిసి చేసిన దానాలకంటే తెలియకుండా చేసిన దానాలెన్నో అంటారు. తాను దానం చేశానంటే తనకి పేరు వచ్చినా? ఆ సాయాన్ని పొందిన వ్యక్తి చిన్నబుచ్చుకుంటాడని ఆయన బయటికి చెప్పేవారు కాదని అంటారు. అలాగే ఎవరైనా సినిమా ఛాన్స్ కావాలని అడిగినా తనకు తెలిసిన వాళ్లతో మాట్లాడి ఇప్పించడం.. లేదంటే తానే సొంతంగా సినిమాలు తీస్తే వాటిలో అవకాలివ్వడం వంటివి చేసేవారు. కష్టం విలువ తెలిసిన నటుడిగా శ్రీహరిని చెబుతుంటారు. ఎంతో సౌమ్యుడిగానూ ఆయనకు పేరుంది.
