Begin typing your search above and press return to search.

ఇప్పటికీ చిన్న పిల్లవాడే.. ప్రభాస్ పై హీరోయిన్ కామెంట్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అక్కడి నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్రకటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు.

By:  Madhu Reddy   |   19 Aug 2025 11:58 AM IST
ఇప్పటికీ చిన్న పిల్లవాడే.. ప్రభాస్ పై హీరోయిన్ కామెంట్స్!
X

రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అక్కడి నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్రకటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో మారుతి 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', హను రాఘవపూడి 'ఫౌజీ' చిత్రాలతో పాటు 'సలార్ 2', 'కల్కి 2' చిత్రాలను లైన్ లో పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'ది రాజా సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఒక హీరోయిన్ "ఇప్పటికీ చిన్న పిల్లవాడే" అంటూ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరు? ప్రభాస్ తో ఆమెకున్న సాన్నిహిత్యం ఏమిటి? ఏ సందర్భంలో ప్రభాస్ ఇంకా చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు? అనే విషయాలు వైరల్ అవుతున్నాయి.

సుందరకాండ మూవీతో శ్రీదేవి రీ ఎంట్రీ..

ఆమె ఎవరో కాదు ప్రభాస్ కి జోడీగా 'ఈశ్వర్' సినిమాలో నటించిన శ్రీదేవి విజయ్ కుమార్. ప్రభాస్ తొలి సినిమా కథానాయికగా క్రెడిట్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నారా రోహిత్ హీరోగా వస్తున్న 'సుందరకాండ' సినిమా ద్వారా కథానాయికగా రీ ఎంట్రీ ఇస్తోంది. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతంరెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఆ విషయంలో ప్రభాస్ ఇప్పటికీ చిన్నపిల్లాడే - శ్రీదేవి విజయ్ కుమార్

సుందరకాండ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న శ్రీదేవి మాట్లాడుతూ.. "ప్రభాస్ తో ఈశ్వర్ సినిమా నుంచి మొదలైన మా స్నేహం.. అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది..ప్రభాస్ లో ఎలాంటి మార్పు లేదు.. ఈ రోజుకీ ఆయన చిన్న పిల్లాడిలానే నవ్వుతూ మాట్లాడుతాడు. నేను ఊహించిన దానికంటే పెద్ద స్టార్ అయిపోయారు" అంటూ ప్రభాస్ పై తన అభిప్రాయాన్ని పంచుకుంది శ్రీదేవి విజయ్ కుమార్.

నా నిర్ణయం అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చింది - శ్రీదేవి

అలాగే తన రీ ఎంట్రీ గురించి కూడా మాట్లాడుతూ.." నేను హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను . అయితే నా నిర్ణయం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించినా.. నా పెళ్లి విషయంలో మా ఇంట్లో వాళ్ళు ముందే ప్రణాళికతో ఉన్నారు. అలా నా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాను. కానీ మధ్యలో టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల తెరకు దూరమయ్యానన్న భావన నాలో ఎప్పుడూ కలగలేదు. మళ్లీ ఇన్నేళ్ల నన్ను ఇలా హీరోయిన్ గా తెరపై చూసుకోవడం నాకు మరింత ఆసక్తికరంగా అనిపిస్తోంది. మొదట దర్శకుడు వెంకటేష్ ఈ కథ చెప్పగానే షాక్ అయ్యాను. స్క్రిప్ట్ కొత్తగా అనిపించింది. వెంటనే ఓకే చెప్పాను" అంటూ శ్రీదేవి తెలిపింది.