నాతో ఒకే గదిలో ఉండటానికి శ్రీదేవి నిరాకరించింది: బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోనీకపూర్ ని పెళ్లాడటం అప్పట్లో ఒక సంచలనం.
By: Sivaji Kontham | 8 Sept 2025 9:51 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోనీకపూర్ ని పెళ్లాడటం అప్పట్లో ఒక సంచలనం. ఈ జంట అన్యోన్య దాంపత్యంలో ఇద్దరు పిల్లలు కలిగారు. జాన్వీకపూర్, ఖుషీకపూర్ ఇప్పుడు స్టార్లుగా నటనారంగంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే శ్రీదేవి నటించిన చివరి చిత్రం `మామ్` గురించి ప్రస్థావించిన నిర్మాత బోనీకపూర్, శ్రీదేవి గురించిన ఒక సంచలన విషయం బయటపెట్టారు. జార్జియాలో `మామ్` చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక హోటల్ లో బస చేసినప్పుడు, ఒకే గదిలో ఉండేందుకు నా భార్య శ్రీదేవి నిరాకరించిందని బోనీకపూర్ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి తనతో ఒకే గదిలో ఉండటానికి నిరాకరించడానికి కారణం కూడా ఉంది. మామ్ (అమ్మ) పాత్రలో శ్రీదేవి నటిస్తోంది. తన పాత్ర నుంచి డైవర్షన్ ఉండకూడదని భావించడం వల్లనే భర్త అయిన తనను గదిలోకి ఆహ్వానించలేదని బోనీ వివరించాడు. తన పాత్ర కోసం అంత డెడికేటెడ్ గా ఉండే నటి వేరొకరు ఉండరని కూడా బోనీ వెల్లడించారు.
మామ్ తెలుగు డబ్బింగ్ పూర్తి చేసి, మలయాళ వెర్షన్ కి కూడా శ్రీదేవి స్వయంగా డబ్బింగ్ చెప్పారని బోనీ తెలిపారు. అయితే డబ్బింగ్ థియేటర్ లో తనతో పాటు మలయాళ డబ్బింగ్ ఆర్టిస్టును కూడా శ్రీదేవి కూచోబెట్టారు. తన నటనకు, లిప్ సింక్ అయ్యేలా డబ్బింగ్ కుదిరిందో లేదో చెక్ చేసేందుకు శ్రీదేవి అలా చేసారు. ఇలాంటి పట్టుదల డెడికేషన్ తనకు మాత్రమే చెల్లిందని బోనీ అన్నారు.
భాష రాకపోవడం వల్ల హిందీ చిత్రపరిశ్రమలో తన నటనా కెరీర్ కి ఇబ్బంది తలెత్తుతుందని భావించిన శ్రీదేవి వెంటనే హిందీ నేర్చుకున్నారని, తనతో పాటే డబ్బింగ్ థియేటర్ లో ఒక హిందీ టీచర్ ఉండేవారని కూడా బోనీకపూర్ నాటి సంగతిని గుర్తు చేసారు. శ్రీదేవి నటించిన ఐదారు సినిమాలు హిందీలోకి డబ్ అయి రిలీజయ్యాయి. ఆ తర్వాత శ్రీదేవి హిందీ నేర్చుకున్నారని బోనీ తెలిపారు. మామ్ కోసం రెహమాన్ ని ఎంపిక చేసుకున్నాం. అతడి ఖరీదైనవాడు. భరించలేకపోయాను. చివరకు శ్రీదేవి తన ఫీజుల నుంచి 50-70లక్షలు రెహమాన్ కోసం త్యాగం చేసేందుకు వెనకాడలేదని కూడా బోనీ చెప్పారు.
