Begin typing your search above and press return to search.

శ్రీదేవిని పాప‌క్కా అంటూ పిలిచిన మేన‌కోడ‌లు మ‌హేశ్వ‌రి!

భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమైన దివంగత నటి శ్రీదేవి 63వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ..అభిమానులు మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

By:  Srikanth Kontham   |   15 Aug 2026 7:00 AM IST
శ్రీదేవిని పాప‌క్కా అంటూ పిలిచిన మేన‌కోడ‌లు మ‌హేశ్వ‌రి!
X

భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమైన దివంగత నటి శ్రీదేవి 63వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ..అభిమానులు మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. శ్రీదేవి లేని లోటును భర్తీ చేయలేక పోయినా? ఆమె సృష్టించిన కళాఖండాలు, వ్యక్తిత్వ విశేషాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. శ్రీదేవి మేనకోడలు, నటి మహేశ్వరి శ్రీదేవిని ఎంతో ప్రియంగా పాపక్క అని సంబోధించారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని అరుదైన, ఇంతవరకు చూడని ఫోటోలను పంచుకున్నారు. `పుట్టినరోజు శుభాకాంక్షలు పాపక్క.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను` అంటూ ఆమె రాసిన భావోద్వేగపూరితమైన సందేశం అభిమానులను కదిలించింది. శ్రీదేవితో గడిపిన చిన్ననాటి క్షణాలను, ఆమెతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ ఫోటోలు ప్రతిబింబిస్తున్నాయి.

మహేశ్వరి పంచుకున్న ఫోటోలలో శ్రీదేవి ఎంతో హుందాగా, సాంప్రదాయ పట్టు చీరలో కనిపిస్తున్నారు. ఒక ఫోటోలో చిన్నారి మహేశ్వరి పక్కనే శ్రీదేవి మురిసిపోతూ పూలగుచ్ఛాన్ని పట్టుకుని ఉండటం, మరొక ఫోటోలో ఆమె ఎంతో సహజంగా అందరికీ భోజనం వడ్డిస్తుండటం వంటి దృశ్యాలు ఆమెలోని మంచితనాన్ని చాటిచెబుతున్నాయి. ఈ చిత్రాలు శ్రీదేవిని ఒక స్టార్‌గా మాత్రమే కాకుండా ఇంట్లో బాధ్యతాయుతమైన సభ్యురాలిగా ఎలా ఉండేవారో చూపుతున్నాయి.

సినిమా రంగంలోకి రావడానికి శ్రీదేవి ప్రేరణ ఎలా నిలిచారో మహేశ్వరి గతంలో పలుమార్లు వెల్లడించారు. కేవలం నటనలోనే కాకుండా ఫ్యాషన్ రంగంలో కూడా శ్రీదేవికి అండగా నిలుస్తూ ఆమెకు వస్త్రాలను డిజైన్ చేసే స్థాయికి మహేశ్వరి ఎదిగారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అత్తాకోడళ్లది మాత్రమే కాదు. ఒకరికొకరు మద్దతుగా నిలిచిన గొప్ప స్నేహ బంధం అని వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం స్పష్టం చేస్తోంది.

శ్రీదేవి వారసత్వాన్ని ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ కొనసాగిస్తున్నారు. తల్లికి ఉన్న కీర్తిని, నటన పట్ల అంకితభావాన్ని పుణికిపుచ్చుకున్న కుమార్తెలు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఖుషీ తదుపరి సినిమాలతో.. జాన్వీ విభిన్న పాత్రలతో శ్రీదేవి జ్ఞాపకాలను మళ్ళీ తెరపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అకాల మరణం శ్రీదేవిని అభిమానుల‌ నుండి దూరం చేసినా? ఆమె జయంతి సందర్భంగా పంచుకుంటున్న ఇలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ అభిమానుల‌ మధ్యే ఉంచుతున్నాయి. శ్రీదేవి వంటి గొప్ప కళాకారిణిని స్మరించుకోవడం ప్రతి ఏటా ఓ మంచి వాతావరణాన్ని తీసుకొస్తుంది. శ్రీదేవి అందించిన ఎన్నో మరపురాని పాత్రలు, భావోద్వేగాలు తరతరాల సినీ ప్రేక్షకులకు ఆదర్శంగానే ఉంటాయి.