మరోసారి రిస్క్ చేస్తున్న శ్రీవిష్ణు
కోన వెంకట్ సమర్పణ లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా, 1992 టైమ్ లో ఆంధ్రప్రదేశ్ లో ని మాడుగుల అనే ప్రాంతంలో జరిగిన కథగా ఇది తెరకెక్కుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Oct 2025 2:00 AM ISTటాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. మొదటి నుంచి శ్రీవిష్ణు డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుని ప్రయోగాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ ప్రత్యేకతే శ్రీవిష్ణుకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. అయితే శ్రీవిష్ణు మొదట్లో ఎక్కువగా సీరియస్ కథలను ఎంచుకుంటూ ఆ సినిమాలే చేసేవారు. అతని బాడీ లాంగ్వేజ్ కు అలాంటి సినిమాలే సెట్ అవుతాయని కూడా అందరూ అనుకున్నారు.
కామెడీ సినిమాలకు కేరాఫ్ గా శ్రీ విష్ణు
కానీ ఎప్పుడైతే శ్రీ విష్ణు కామెడీ సినిమాలు చేయడం మొదలుపెట్టారో అతని బలం మొత్తం అందులోనే ఉందనిపించింది. బ్రోచేవారెవరురా సినిమాతో తనలోని అసలైన కామెడీ టైమింగ్ ను బయటపెట్టిన శ్రీ విష్ణు ఆ తర్వాత సామజవరగమన, శ్వాగ్, సింగిల్ లాంటి కామెడీ సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా కామెడీ జానర్ లో మంచి హిట్లు కూడా అందుకున్నారు.
నిరాశ పరిచిన సీరియస్ సినిమాలు
దానికి తోడు ఆ సినిమాలకు ముందు శ్రీ విష్ణు చేసిన సీరియస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలవడంతో అతను కూడా కామెడీ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా అవే చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు మళ్లీ తన పాత స్కూల్ కు వెళ్లి మరోసారి ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. జానకి రామ్ అనే కొత్త దర్శకుడితో శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
డ్యూయెల్ రోల్ లో శ్రీ విష్ణు
కోన వెంకట్ సమర్పణ లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా, 1992 టైమ్ లో ఆంధ్రప్రదేశ్ లో ని మాడుగుల అనే ప్రాంతంలో జరిగిన కథగా ఇది తెరకెక్కుతుంది. అంతేకాదు, ఈ మూవీలో శ్రీ విష్ణు డ్యూయెల్ రోల్ కూడా చేస్తున్నారని సమాచారం. కామెడీ సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు నక్సలైట్ గా సినిమా చేస్తున్నారంటే అది ఆయనకు రిస్క్ అనే చెప్పాలి. అయినప్పటికీ శ్రీ విష్ణు కథను నమ్మి ఒప్పుకున్నారంటే ఆ కథలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రిస్క్ తో శ్రీ విష్ణు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
