నాల్గవ హీరోను పరిచయం చేయనున్న శ్రీలీల..!
శ్రీలీల గత ఏడాది మూడు సినిమాలతో వచ్చింది. అందులో జూనియర్ కాస్త పర్వాలేదు అనిపించినా మిగిలిన సినిమాలు ఆమెకు తీవ్రంగా నిరాశను మిగిల్చాయి.
By: Ramesh Palla | 9 Sept 2026 1:48 PM ISTశ్రీలీల గత ఏడాది మూడు సినిమాలతో వచ్చింది. అందులో జూనియర్ కాస్త పర్వాలేదు అనిపించినా మిగిలిన సినిమాలు ఆమెకు తీవ్రంగా నిరాశను మిగిల్చాయి. దాంతో శ్రీలీల పని అయిపోయిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో పరాశక్తితోనూ ఫ్లాప్‌ను చవిచూసిన శ్రీలీలకి ఉస్తాద్ భగత్ సింగ్‌తో కాస్త ఊరట దక్కిందని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల చేస్తున్న సినిమాలు ఏంటి అంటే ఠక్కున చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ఒకటి రెండు సినిమాలకు పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె సినిమాను కన్ఫర్మ్ చేయలేదు. మరో వైపు బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
మోక్షజ్ఞ హీరోగా వశిష్ట దర్శకత్వంలో మూవీ...
ఈ సమయంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు తాజాగా ఆమెతో చర్చలు జరిపారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలకృష్ణ సూచన మేరకు మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మోక్షజ్ఞ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయిన విషయం తెల్సిందే. దాంతో హీరోయిన్ ను సైతం అదే స్థాయిలో బాలీవుడ్ నుంచి దించుతారని అంతా భావించారు. కానీ బాలకృష్ణ ఈ సినిమా కోసం శ్రీలీల అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో దర్శకుడు వశిష్ట లుక్ టెస్ట్‌కి రెడీ అయ్యాడని తెలుస్తోంది. మోక్షజ్ఞ, శ్రీలీలపై లుక్ టెస్ట్ చేయడంతో పాటు, కొన్ని సీన్స్ సైతం షూట్ చేసి పరిశీలించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
ముగ్గురు హీరోల మొదటి సినిమాల్లో శ్రీలీల హీరోయిన్...
మోక్షజ్ఞ మొదటి సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తే అరుదైన రికార్డ్ ఆమె సొంతం అవుతుంది. ఇప్పటి వరకు ముగ్గురు హీరోలను శ్రీలీల ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కన్నడ హీరో విరాట్ మొదటి సినిమా 'కిస్'. ఆ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. కిస్ హీరో విరాట్ కి, శ్రీలీలకు మొదటి సినిమా కావడం విశేషం. ఆ తర్వాత రోషన్ మేకా హీరోగా పరిచయం అయిన 'పెళ్లి సందడి' సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్‌లో శ్రీలీలకు అదే మొదటి సినిమా. రోషన్ మేకా మొదటి సినిమాకు శ్రీలీల సరైన జోడీ అనే అభిప్రాయంతో రాఘవేంద్ర రావు ఆమెను ఏరికోరి ఎంపిక చేశాడని అంటారు. ఆ తర్వాత కన్నడం నుంచి వచ్చిన కిరీటి రెడ్డి మొదటి సినిమా 'జూనియర్' లోనూ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఈ ముగ్గురు హీరోల మొదటి సినిమాల్లో శ్రీలీల హీరోగా నటించడం జరిగింది.
శ్రీలీల ఎంపిక బాలకృష్ణ నిర్ణయం?
శ్రీలీల ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి సీనియర్ హీరోల సినిమాల్లో నటించిన కారణంగా ఇప్పుడు మోక్షజ్ఞ మొదటి సినిమాలో ఆమెను నటింపజేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు నందమూరి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. వయసులో మోక్షజ్ఞ కంటే శ్రీలీల చాలా చిన్నదే అయినప్పటికీ ఆమె పెద్ద హీరోలతో నటించిన కారణంగా ఆలోచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం తనతో భగవంత్ కేసరి సినిమాలో నటించిన కారణంగా, ఆ సమయంలో ఆమె గురించి తెలిసి, ఆమె ప్రతిభ గుర్తించి ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో నటింపజేయాలని చూస్తున్నాడు అనేది కొందరి మాట. అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి కానీ, దర్శకుడు వశిష్ట నుంచి కానీ ఈ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఫ్యాన్స్ దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది కొందరి మాట.
