అల్లు అర్జున్ అందుకే ఆరోజు అలా అన్నారు
ఈ వేడుకలో రెడ్ కార్పెట్ గ్లామర్ మాత్రమే కాకుండా, కొన్ని ఆసక్తికర సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
By: Sravani Lakshmi Srungarapu | 20 March 2026 7:58 PM ISTఇటీవల కేరళలోని కొచ్చి వేదికగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక సినీ ప్రముఖులతో కళకళలాడింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన అగ్రతారలు ఒకే వేదికపై మెరిసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ గ్లామర్ మాత్రమే కాకుండా, కొన్ని ఆసక్తికర సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈమె నా రిలేటివ్ అని చెప్పిన బన్నీ
అలాంటి సంఘటనల్లో ప్రధానంగా నిలిచింది అల్లు అర్జున్, మమ్ముట్టి, శ్రీ గౌరీ ప్రియ రెడ్డి మధ్య జరిగిన చిన్న పరిచయ ఘటన. ఈ సంఘటనలో మమ్ముట్టి పక్కన నిలబడి ఉన్న గౌరీ ప్రియను చూసిన అల్లు అర్జున్, ఆమెను పరిచయం చేస్తూ ఈమె నా రిలేటివ్ అని చెప్పడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యాఖ్య వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లలో ఆసక్తికర చర్చ మొదలైంది.
పలు సందేహాలతో బన్నీ ఫ్యాన్స్
బన్నీ చెప్పిన ఈ మాట నిజంగా బంధుత్వాన్నే సూచించిందా? లేక సరదాగా, మర్యాదపూర్వకంగా అన్న వ్యాఖ్యనా? అన్న సందేహాలు అప్పట్నుంచి ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గౌరీ ప్రియ టాలీవుడ్‌కు చెందిన నటి కావడంతో, ఆమెను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ అలా అన్నారేమోనని కొందరు భావించారు. మరికొందరు మాత్రం నిజంగా వీరిద్దరి మధ్య కుటుంబ సంబంధం ఉందేమోనని చర్చించుకున్నారు.
స్నేహా రెడ్డితో మంచి అనుబంధం
ఈ ఊహాగానాల మధ్య, హ్యాపీ రాజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో గౌరీ ప్రియ స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని వెల్లడించింది. ఆ స్నేహబంధం కారణంగా బన్నీ తనను సరదాగా రిలేటివ్‌గా పరిచయం చేశారని ఆమె చెప్పింది. అల్లు అర్జున్ ఎంతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి అని, కొత్తవారిని ప్రోత్సహిస్తూ దగ్గరకు తీసుకుంటారని గౌరీ ప్రియ పేర్కొంది. తనను కూడా ఎంతో ప్రోత్సహిస్తూ మంచి చేయాలని ఆశీర్వదించారని చెప్పింది.
ఇదిలా ఉంటే, గౌరీ ప్రియ ప్రస్తుతం టాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందుతోంది. రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ లాంటి సినిమాలతో ఆమె ప్రేక్షకుల మన్ననలు పొందింది. తన అందం, సహజమైన నటనతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్ స్టోరీలో నటిస్తూ, మరోవైపు తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌ను విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో నోట ఆమె పేరు వినిపించడం గౌరీ ప్రియ కెరీర్‌కు అదనపు బూస్ట్ ఇచ్చే అంశంగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెపై ఇంట్రెస్ట్ పెరిగిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ యంగ్ హీరోయిన్‌కు మరిన్ని అవకాశాలు దక్కే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
