ఇండస్ట్రీ 'పవర్ గ్రూప్స్' గుట్టు రట్టు చేసిన నటి!
పరిశ్రమలో కార్మికుల హక్కులను కాపాడాల్సిన యూనియన్ నాయకులే, నటీనటుల , సాంకేతిక నిపుణుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని శ్రీలేఖ మిత్ర విమర్శించారు.
By: Srikanth Kontham | 7 Jun 2026 7:00 PM ISTసినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులు.. పవర్ గ్రూపుల ఆధిపత్యంపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత పలు పరిశ్రమల్లోని మహిళా నటీమణులు తమకు జరిగిన అన్యాయాలపై గొంతు విప్పుతున్నారు. ఈ క్రమంలోనే బెంగాలీ సినీ పరిశ్ర మకు చెందిన నటి శ్రీలేఖ మిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా రంగంలో పవర్‌ఫుల్ వ్యక్తుల ఒత్తిళ్లకు .. అన్యాయాలకు లొంగని వారిని ఏ విధంగా పక్కన పెడతారో? శ్రీలేఖ మిత్ర తన వ్యక్తిగత అనుభవం ద్వారా వివరించే ప్రయత్నం చేసారు.
పరిశ్రమలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తుల వల్ల తాను దాదాపు పదేళ్ల పాటు పరోక్షంగా నిషేధానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తన నటనపై ఎంతో నమ్మకం ఉన్నప్పటికీ లొంగిపోని నైజం వల్లే తనకు రావాల్సిన అవకాశాలను కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఫెడరేషన్ ఆఫ్ సినీ టెక్నీషి యన్స్ అండ్ వర్కర్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అధ్యక్షుడు స్వరూప్ బిస్వాస్ అరెస్ట్ కావడంపై శ్రీలేఖ మిత్ర స్పందించారు. టెక్నీషియన్ల యూనియన్‌లో జరుగుతోన్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం , వేధింపుల ఆరోపణల నేపథ్యంలో స్వరూప్ బిస్వాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామంపై స్పందిస్తూ పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న ఇలాంటి పవర్ గ్రూపుల ఆట కట్టించడానికి ఇదొక మంచి ఆరంభమని అభిప్రాయపడ్డారు.
పరిశ్రమలో కార్మికుల హక్కులను కాపాడాల్సిన యూనియన్ నాయకులే, నటీనటుల , సాంకేతిక నిపుణుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని శ్రీలేఖ మిత్ర విమర్శించారు. ఎవరైనా తమకు ఎదురు తిరిగితే వారికి పని దక్క కుండా చేయడం, పరిశ్రమ నుండి బహిష్కరించడం వంటి బెదిరింపులకు పాల్పడే సంస్కృతి ఇక్కడ బలంగా నాటుకుపోయిందని మండిపడ్డారు. స్వరూప్ బిస్వాస్ అరెస్ట్ అనేది వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్లును శుభ్రం చేయడానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ అరెస్ట్ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాకూడదని పరిశ్రమలో ఇంకా ఎంతోమంది ఇలాంటి లబ్ధిదారులు, వేధింపులకు గురిచేసే పవర్‌ఫుల్ వ్యక్తులు ఉన్నారని శ్రీలేఖ గుర్తుచేశారు.
బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు. చలనచిత్ర రంగం అనేది కొద్దిమంది సొత్తు కాదని, ప్రతి ఒక్కరికీ ఇక్కడ స్వేచ్ఛగా, గౌరవప్రదంగా పనిచేసే వాతావరణం ఉండాలన్నారు. శ్రీలేఖ మిత్ర చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ సినీ పరిశ్రమల్లో అంతర్గతంగా సాగుతున్న మాఫియా తరహా పోకడలను ఎండగడుతున్నాయి. పదేళ్ల పాటు కెరీర్‌ను కోల్పోయినప్పటికీ ఆమె ధైర్యంగా గొంతు విప్పడంతో చిత్రసీమలో మార్పు కోరుకునే ఎంతోమందికి కొత్త ధైర్యాన్ని ఇచ్చినట్లయింది. భవిష్యత్తులో ఈ అరెస్టులు ..విచారణలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.
