బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్? ఎప్పుడంటే?
ఇదిలా ఉండగా.. వివాహం ఈ నెల 29న హైదరాబాద్ లో జరగనుందట. నగరంలోని వారి ప్రైవేట్ ఫామ్ హౌస్ లో సాయి శ్రీనివాస్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 4 April 2026 12:19 AM ISTటాలీవుడ్ లో మరో శుభవార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ఛాప్టర్ కు రెడీ అవుతున్నారు. ఆయన వివాహం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఆయన నిశ్చితార్థం ఈ నెల 5న తిరుమలలో జరగనుంది.
తిరుమలలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యే ఆ వేడుకతో వివాహ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. నిశ్చితార్థం తర్వాత వివాహ వేడుకలు గ్రాండ్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. వివాహం ఈ నెల 29న హైదరాబాద్ లో జరగనుందట. నగరంలోని వారి ప్రైవేట్ ఫామ్ హౌస్ లో సాయి శ్రీనివాస్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అత్యంత వైభవంగా, భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్ని ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదలుపెట్టారని వినికిడి.
ఇటీవలే సాయి శ్రీనివాస్ రోకా వేడుక సాదాసీదాగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. సాయి శ్రీనివాస్ కు కాబోయే వధువు పేరు కావ్య రెడ్డి. హైదరాబాద్ కు చెందిన ఆమెకు సినీ రంగంతో ఎలాంటి సంబంధం లేదని సమాచారం. ఆమె ప్రముఖ న్యాయవాది కుమార్తెగా తెలిసింది. కొంతకాలంగా వీరిద్దరూ పరస్పరం పరిచయం పెంచుకుని ప్రేమలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇరువైపుల కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటవుతున్నారట.
అయితే అల్లుడు శీను చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత జయ జానకి నాయక వంటి యాక్షన్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే రాక్షసుడు వంటి థ్రిల్లర్ తో నటుడిగా తన ప్రతిభను మరోసారి నిరూపించారు. కమర్షియల్, యాక్షన్, థ్రిల్లర్ జానర్లలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. హైందవ, టైసన్ నాయుడు వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
కెరీర్ పరంగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు కూడా వేడుకల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శ్రీనివాస్ వివాహం ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన వేడుకల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
