Begin typing your search above and press return to search.

10 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన మ‌రో జోడీ!

మలయాళ పరిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న నటుడు శ్రీనాథ్ భాసి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని ఆల‌స్యంగా వెల్లడించారు.

By:  Srikanth Kontham   |   13 Sept 2026 2:00 PM IST
10 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన మ‌రో జోడీ!
X

మలయాళ పరిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న నటుడు శ్రీనాథ్ భాసి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని ఆల‌స్యంగా వెల్లడించారు. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు- భార్య రీతూ జకరియాతో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఎన్నో ఏళ్ల సహచర జీవితం తర్వాత విడిపోవడంతో అభిమానులంతా షాక్ అవుతున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే..శ్రీనాథ్ భాసి - రీతూ జకరియా 2016 లో వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లికి ముందే ఇద్ద‌రి మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. శ్రీనాథ్ భాసి బుల్లితెరపై వీజేగా కెరీర్‌ను ప్రారంభించిన రోజుల్లోనే తిరువనంతపురానికి చెందిన రీతూతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహం, ఆ పై ప్రేమ‌గా మారింది. అనంత‌రం ఇరు కుటుబాల‌ను ఒప్పించి వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. ప‌దేళ్ల పాటు క‌లిసి కాపురం చేసారు. కానీ ఇప్పుడా కాపురం వీగిపోయి ఏడాద‌వుతుంది. గ‌త ఏడాదే ఇద్ద‌రు విడిపోయిన‌ట్లు శ్రీనాథ్ తెలిపారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ వ్యక్తిగతంగానే ఉంచామని.. కొద్దిమందికి తప్ప బయట ప్రపంచానికి తెలియదన్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే కలిసి నివసిస్తున్నట్లు శ్రీనాథ్ తెలిపారు.

తల్లిదండ్రుల ఇంటికి మారిన తర్వాత ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తండ్రితో ఏవైనా అభిప్రాయ భేదాలు ..గొడవలు వచ్చినప్పుడు కూడా తట్టుకోవడం కష్టంగా ఉంటుంద‌న్నారు . అలాంటి సమయాల్లో ఉండలేనని పై గదిలోకి వెళ్లినా? తల్లిదండ్రులు లేకుండా తాను జీవించ లేననే నిజాన్ని గ్రహించాన‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి భావోద్వేగ పరిస్థితులను దాటుకుని జీవితంలోని ఓ కొత్త దశను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నానని వెల్ల‌డించారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభ వాలను పక్కన పెట్టి శ్రీనాథ్ భాసి దృష్టిని మళ్లీ సినిమాలపై కేంద్రీకరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే భాసి చేతిలో వరుస ఆఫర్లు ఉన్నాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న `ఒరిజినల్` చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే బిజూ మీనన్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ కామెడీ డ్రామా `అవరాచన్ అండ్ సన్స్` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇలా శ్రీనాధ్ వ్య‌క్తిగత జీవితంలో ఎదురైన మానసిక సంఘర్షణను దాటుకుంటూనే మరోవైపు వృత్తిపరమైన బాధ్యతలను అంతే అంకితభావంతో నెర‌వేర్చ‌డం ఆయన పరిణితికి నిదర్శనం. ఎంతటి కష్ట సమయంలోనైనా నటుడిగా ప్రేక్షకులను అలరించడమే మొదటి ప్రాధాన్యత అని నిరూపిస్తున్నారు. అయితే విడాకుల వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు శ్రీనాథ్ భాసికి మద్దతు తెలుపుతున్నారు.