శ్రీముఖి ఆ ఖాళీని భర్తీ చేయగలదా?
బుల్లితెరపై తన చురుకుదనం, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన శ్రీముఖి, తాజాగా రిలీజైన మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Jun 2026 2:00 PM ISTబుల్లితెరపై తన చురుకుదనం, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన శ్రీముఖి, తాజాగా రిలీజైన మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. యాంకర్‌గా ఇప్పటికే భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఆమె, సినిమాల్లో మాత్రం ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు పొందిన క్యారెక్టర్లను అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమా పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీముఖికి దక్కిన పాత్ర పెద్దది కాకపోయినా, కథలో తన ఉనికిని స్పష్టంగా చాటుకునేలా ఉండటం విశేషం. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో ఆమె చూపించిన నేచురల్ యాక్టింగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. గతంలో తెరపై కనిపించినప్పుడు ఎక్కువగా తన టెలివిజన్ ఇమేజ్ ప్రభావం కనిపించేదనే అభిప్రాయం ఉండేది. కానీ ఈ సినిమాలో మాత్రం పాత్రకు తగ్గట్టుగా తనను పూర్తిగా మార్చుకుని కనిపించిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ఇది శ్రీముఖి కెరీర్‌కు పెద్ద మలుపు అవుతుందా అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టమే కానీ, ఈ సినిమా చూశాక డైరెక్టర్లు, రైటర్స్ కు ఆమె గురించి కొత్త ఆలోచన కలిగించే అవకాశం మాత్రం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ స్టోరీస్, మధ్యతరగతి నేపథ్య పాత్రలు లేదా హీరోహీరోయిన్ల చుట్టూ తిరిగే ప్రామినెంట్ సపోర్టింగ్ రోల్స్ కోసం శ్రీముఖిని పరిశీలించే అవకాశాలు పెరగొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో బలమైన మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత గురించి తరచూ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ మూవీస్ లో కీలకంగా కనిపించిన వారు ఇప్పుడు వయసు పెరిగి పెద్ద వారవడంతో పరిమితంగా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. కొత్త తరం నుంచి కూడా ఆ స్థాయిలో గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో కనిపించడం లేదు. దీంతో డైరెక్టర్లు తరచూ ఒకే ముఖాలపై ఆధారపడాల్సి వస్తోంది.
అలాంటి సమయంలో ప్రేక్షకులకు పరిచయమైన, నటనపై పట్టున్న, కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ కలిగిన శ్రీముఖి వంటి నటి ఇండస్ట్రీకి ఉపయోగపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు గ్లామర్ ఇమేజ్ మాత్రమే కాకుండా కామెడీ, ఎమోషనల్ సీన్స్, కుటుంబ కథలలో సహజంగా ఒదిగిపోయే సామర్థ్యం కూడా ఉందని ఈ సినిమా ద్వారా మరోసారి రుజువైందని విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే మా ఇంటి బంగారం సినిమా శ్రీముఖికి సక్సెస్ కు మించి, ఆమెను ఓ యాంకర్ గా కాకుండా నటిగా మళ్లీ ఇండస్ట్రీ ముందుకు తీసుకొచ్చి, ఆమెలోని నటనను ప్రూవ్ చేసేలా చేసింది. సరైన పాత్రలు, సరైన దర్శకులు దొరికితే టాలీవుడ్‌లో మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల విభాగంలో శ్రీముఖి ఒక ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ సినిమా ఆ ప్రయాణానికి తొలి అడుగు అవుతుందేమో చూడాలి.
